ప్రతాప్ పోతన్ అనగానే నటుడిగా అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘ఆకలి రాజ్యం’, అలానే దర్శకుడిగా ‘చైతన్య’. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రతాప్ పోతన్ తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గ్రే’ సినిమాలో నటించారు. దానికి దర్శకుడు రాజ్ మాదిరాజు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ హఠాన్మరణం ఆ చిత్ర బృందాన్ని షాక్ కు గురి చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్రే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ‘రాజ్… నా కోసం ఓ మంచి కథ తయారు చేయండి. నేను ఫ్రీగా నటిస్తాను’ అని ప్రతాప్ పోతన్ చెప్పిన మాటను ఈ సందర్భంగా రాజ్ మాదిరాజు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రతాప్ పోతన్ కు తన మాటలతో రాజ్ మాదిరాజు ఇలా నివాళి అర్పించారు.
‘ప్రతాప్ పోతన్ మా జనరేషన్ సినిమా ఆడియెన్సుకి, ముఖ్యంగా సినిమా పిచ్చోళ్ళకి బాగా తెలిసిన నటుడు. ఒక విధమైన క్రేజీ ఎక్సెంట్రిక్ సైకోటిక్ ప్రవర్తన ఉన్న పాత్రలలో భలే ఇమిడిపోయేవాడు. ‘గ్రే’ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర రాసుకుంటూండగా ఆయనే మొదట మెదిలింది. ఆయననే ఎదురుగా పెట్టుకుని రాసుకుని పూర్తి కాగానే ఆయనకు ఫోనులో వినిపించాను. చాలా ఇష్టపడ్డారాయన. తన పాత్రని, సినిమాని, నా టీమ్ ని, తన సహ నటీనటులను! స్వతహాగా దర్శకుడు కూడా అవడంతో సెట్లో లెన్సు, లైటింగు గురించి మాట్లాడేవారు. పోట్లాడేవారు. ఎదురు చెప్పబోతే ఈసడించుకునేవారు. ఈర్ష్యపడేవారు. పూర్తయాక చూసి సరేలే అని వెళ్ళిపోయేవారు. ఉదయం ఆరున్నరకి లొకేషనుకొస్తే ప్యాకప్ అయేంతవరకూ అలాగే కూర్చుని ఉండేవారు. ఒకరోజు దాదాపు ముఫ్ఫయ్యారు గంటలు నాన్-స్టాప్ షూటింగు చేశాం.. ఆయన బట్టలనిండా, ఒంటినిండా రక్తం పెట్టుకుని ఆరిపోతోంటే మళ్ళీ మళ్ళీ తడిచేసుకుంటూ అలాగే ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయాక సినిమా, ట్రైలర్ రెండూ పంపించాను. ‘నీ చేతిలో ఒక జెమ్ ఉంది రాజ్.. జాగ్రత్తగా ప్రమోషన్ చేయండి’ అని డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండాలో పది పన్నెండు ఐడియాలు చెప్పారు. 70 ఏళ్ల వయసులో ఆయన ఉత్సాహం, కమిట్‌మెంటు చూస్తే గొప్పగా అనిపించింది.
Pratap Sir.. Team ‘Grey’ misses you.. Can’t believe ‘Grey’ is your last film.. We love you”!!
