హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ ఇటీవల విడుదలై కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతను నటించిన పాత చిత్రం ఒకటి జనం ముందుకు రాబోతోంది. నయనతార నాయికగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించారు. దీనిని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. గోపీచంద్, నయనతార తొలిసారి జోడీ కట్టిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను సమకూర్చగా, అబ్బూరి రవి మాటలు రాశారు. మరి ఎంతోకాలంగా గోపీచంద్, నయన్ అభిమానులను ఊరిస్తూ ఉన్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.