Rama Banam: టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ ఒకటి. వారి కలయికలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు ‘రామబాణం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన ఈ జోడి హ్యాట్రిక్ పై కన్నేసింది. పైగా వీరికి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తోడైంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఇది పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను ఆల్ ది బెస్ట్ చెబుతూ మేకర్స్ ‘రామబాణం’ న్యూ పోస్టర్ ను వదిలారు. గోపీచంద్ పవర్ ఫుల్ లుక్ తో ఉన్న పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలుసిసలు వినోదాన్ని పంచడానికి ‘రామబాణం’ దూసుకొస్తోంది. ఇందులో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. గోపీచంద్ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఖర్చుకి వెనకాడకుండా ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి, సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తున్నారు. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.