సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు విడుదలైన ‘అఖండ’ సినిమా విషయంలో కొన్ని ఏరియాలలో అదనపు ఆటలు, టికెట్ రేట్లను చూసి చూడనట్లు వదిలేసిన ప్రభుత్వం ‘పుష్ప’ విషయంలో మాత్రం సీరియస్ గా వ్యవహరించింది. ‘అఖండ’ సినిమాకు అన్ని చోట్ల కాకపోయినా, కొన్ని బి, సి క్లాస్ సెంటర్స్ లో బెనిఫిట్ షోస్, ఫ్లాట్ రేట్స్ అమ్మారు. అయితే ‘పుష్ప’ విషయంలో కేవలం కొన్ని సి క్లాస్ సెంటర్స్ లో చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో ఆ కేంద్రాలలో ‘పుష్ప’కు కూడా బెనిఫిట్ షోస్, ఫ్లాట్ రేట్స్ లభించాయి.
ప్రభుత్వ నిబంధనలను, జీవో 35ను పక్కాగా అమలు చేయని థియేటర్ యజమానులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండ్రోజులుగా థియేటర్లపై రెవెన్యూ శాఖ ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ థియేటర్ల వారికి నిద్ర లేకుండా చేస్తోంది. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతిరోజు ఎన్ని షోలు ప్రదర్శితమవుతున్నాయి, ఒక్కో టికెట్ ధర, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్‌లో ధరలు, విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, పార్కింగ్ ఛార్జీలు తదితర అంశాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు.
నిర్వహణ సక్రమంగా ఉందా? లేదా? అని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నిబంధనలు కొత్తవి కావు. చాలా ఏళ్ళ క్రితమే సినిమాటోగ్రఫీ చట్టంలో వీటిని చేర్చారు. అయితే ఇన్ని రోజులుగా అధికారులు ఎవరూ థియేటర్లను తనిఖీ చేయలేదు అంతే. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా థియటర్ల వారు కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఆఫీసుల నుంచి అన్ని మండల కేంద్రాలకు వాట్సస్ మెసేజ్ లు వెళ్ళాయి. దాని ప్రకారం రెవెన్యూ శాఖ మొత్తం డేటా సేకరించి జాయింట్ కలెక్టర్లకు పంపుతోంది. జాయింట్ కలెక్టర్లు జిల్లాలకు సంబంధించిన అన్ని నివేదికలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు.
‘అఖండ’ కంటే అన్ని చోట్లా ‘పుష్ప’ వసూళ్ళు తక్కువే!
టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ లేక పోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పుష్పకు భారీ దెబ్బ తగిలింది. నిజానికి ‘పుష్ప’ కంటే ‘అఖండ’ నిర్మాణ వ్యయం, బిజినెస్ రేంజ్ తక్కువ. కానీ వసూళ్ళ విషయంలో అన్ని చోట్లా ‘అఖండ’ కంటే ‘పుష్ప’ కలెక్షన్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన అన్ని ఏరియాల్లోనూ ‘పుష్ప’ను కొన్న పంపిణీదారులు భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
దానయ్యపై ఫోకస్ పెడతారా!?
థియేటర్ల వారితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయించింది ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య అనే ప్రచారం సాగుతోంది. దీంతో దానయ్యపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతుందనే న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’కి గట్టి దెబ్బ తగులుతుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల వారు కొన్న రేట్లకు తగ్గించి కడతామని అంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క సీడెడ్ ఏరియాలోనే రూ.48 కోట్లకు గాను రూ.41 కోట్లనే కడతామని అన్నట్లు వినిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫిగర్ పెద్ద మొత్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ అధికారులు జరిపే ఆకస్మిక దాడులు థియేటర్ యజమానులకు కొత్త తలనొప్పిగా మారాయి. మరి నిబంధనలు పాటించని థియేటర్లను ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.