మరపురాని మధురగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ‘ఘంటసాల శతజయంతి ఉత్సవాలను’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంకల్పించారు. ఈ విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సావిత్రమ్మ. ఆమె అనారోగ్య కారణంగా ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపగా, ఆమె సందేశాన్ని ఘంటసాల రెండవ కూతురు సుగుణ చదివి వీడియో ద్వారా పోస్ట్ చేశారు. తెలుగునేలపై జన్మించిన ఘంటసాల దక్షిణాది సంగీతాభిమానులందరికీ ఆనందం పంచారు. ఆయన తెలుగువారయినందుకు తెలుగుజాతి గర్విస్తోంది. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించడం పట్ల కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఘంటసాలపై ఓ ప్రత్యేక సావనీర్ ను ప్రభుత్వం వెలువరుస్తోంది.
1922 డిసెంబర్ 4న కృష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల వేంకటేశ్వరరావు విజయనగరంలో సంగీతాభ్యాసం చేశారు. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో చిత్రసీమలో రాణించారు. ‘కీలుగుర్రం, మనదేశం’ చిత్రాలకు సంగీతం సమకూరుస్తూ సంగీత దర్శకులయ్యారు. ‘పాతాళభైరవి’ ఘనవిజయంతో ఘంటసాల జైత్రయాత్ర మొదలయింది. అప్రతిహతంగా రెండున్నర దశాబ్దాల పాటు ఘంటసాల గానలీల సాగింది. ఇలాంటి ఘంటసాల గానప్రస్థానంలోని పలు విశేషాలు సావనీర్ లో చోటు చేసుకోనున్నాయి.