సోనీ లివ్ తెలుగు ఓటీటీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అందులో అన్నీ వింత వింత కథా చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తొలి చిత్రం ‘వివాహ భోజనంబు’ తప్పితే అన్ని వర్గాలను అలరించే చిత్రమేదీ అందులో ఆ తర్వాత రాలేదు. బహుశా డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారానే తమ ఉనికిని చాటుకోవాలని ఆ సంస్థ భావిస్తోందేమో తెలియదు! లేదా అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సోనీ లివ్ నిలవాలని భావించినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ఆ తరహా సినిమాలే అధికంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవకు చెందిందే సుహాస్ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.
కొన్ని నెలల క్రితం ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ పోస్టర్ విడుదల కాగానే, చాలామంది థ్రిల్ ఫీలయ్యారు. ఆ తర్వాత ట్రైలర్ ను చూసి ఇది రొటీన్ గా వస్తున్న సినిమాల వంటిది కాదని ఫిక్స్ అయిపోయారు. నిజంగానే ఇది రొటీన్ కు భిన్నమైన సినిమా! ఎంతా? అంటే…. ఇంతా! అని చెప్పలేనంత!! అన్నదమ్ములైన రామ్, లక్ష్మణ్ (సుహాస్, తేజ కాసరపు)లకు వాళ్ళ నాన్న (సంజయ్ రథా) అంటే పడదు. ఆయన పెట్టే టార్చర్ భరించలేక రామ్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. రెండో కొడుకు లక్ష్మణ్ ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి చేసుకున్నాడనే కోపంతో అతన్ని కూడా ఇంట్లోంచి పంపేయాలని తండ్రి చూస్తుంటాడు. అంతేకాదు, పెళ్ళి అయిన దగ్గర నుండి ఆ ఇంటి పెద్దాయన భార్యను కూడా టార్చర్ చేస్తుంటాడు. అది కొడుకులిద్దరికీ కంటగింపుగా ఉంటుంది. సో… తల్లితో కలిసి రామ్, లక్ష్మణ్ తమ తండ్రి మీద ఎలా కక్ష తీర్చుకున్నారన్నదే ఈ చిత్ర కథ.
గతేడాది ‘కలర్ ఫోటో’తో హీరో అయినా సుహాస్ ఇందులో రామ్ గా నటించాడు. ట్రైలర్ చూసినప్పుడు సుహాస్ ది సీరియల్ కిల్లర్ పాత్ర అనేది అర్థమైపోయింది. కానీ ఎందుకోసం అతను కిల్లర్ గా మారాడు, బ్లేడ్ ముక్కతో గొంతుకోసి మరీ చంపాలనేంత కసి అతనికి వాళ్ళ మీద ఎందుకొచ్చిందనేది ఆ ట్రైలర్ చూస్తే తెలియలేదు. చిత్రం ఏమంటే… ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసినా తెలియడం లేదు. ఎందుకంటే… దర్శకుడు తాను రాసుకున్న కథకు కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకుని సినిమా తీసేశాడు. వాళ్ల మధ్య అనుబంధాన్ని, ఆత్మీయతలను చూపించే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు. తండ్రిని చంపేయాలనేంత కసి కొడుకులకు ఎందుకు కలిగిందనే దానికి బలమైన కారణం కూడా చూపించలేదు. వాళ్ల మానసిక పరిస్థితి అంతగా ఎందుకు దిగజారిపోయిందో అర్థం కాక మనం జుత్తు పీక్కోవాల్సిందే. అయితే, కథలో ఊహించని ట్విస్టులు చాలానే ఉంటాయి. వాటికి రీజన్ లేకపోయినా, కాస్తంత థ్రిల్ ను కలిగిస్తాయి. అంతలోనే ఇలాంటివి అసలు ఎలా సాధ్యం? అనే సందేహం మనకు కలుగుతుంది. తెర మీద ఆర్టిస్టులు రూపాయికి పది రూపాయల నటన చూపించినా, ఎందుకో మనం కనెక్ట్ కాలేం. సుహాస్ నటనా చాతుర్యం చూపడానికి ఈ సినిమా తీశారేమో అనే డౌట్ కూడా కొన్ని సందర్భాలలో వస్తుంది. ఎంత థియేటర్ ఆర్టిస్టులను ప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకున్నా, మరీ అంత డ్రామా అవసరమా అనే సందేహం కలుగుతుంది. ఇంటి పెద్దాయన తెలుగును పట్టి పట్టి మాట్లాడుతూ ఉంటాడు. (కనీసం డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది). మరో పక్క పెద్ద కొడుకేమో దేవుడి శ్లోకాలు, స్త్రోత్రాలు అద్భుతంగా పాడేస్తుంటాడు. కొడుకుల మీద గుడ్డి ప్రేమ చూపించే తల్లి, కనీసం ఆడపిల్లలనే కనికరం కూడా లేకుండా కోడళ్లను టార్గెట్ చేస్తుంది. ఈ సినిమా గురించి, అందులోని క్యారెక్టర్ల గురించి, వాళ్ళ మానసిక స్థితి గురించి నిజానికి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
తెలుగులో ఈ తరహా సినిమా ఇంతవరకూ రాలేదని దర్శకుడు మెహర్ తేజ్ చెప్పిన మాట వాస్తవం. నిజంగానే ఇది రేర్ మూవీ. సుహాస్, తేజ కాసరపు, పూజా కిరణ్, అనుష నూతల, శ్రుతిమెహర్, సంజయ్ అంతా చక్కని నటనే కనబరిచారు. కాకపోతే కొన్ని చోట్ల కాస్తంత ఓవర్ అయ్యింది అంతే. ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ – సంజయ్ నేపథ్య సంగీతం. అది లేకపోతే మూవీని భరించడం కష్టమే. అలానే వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఇలాంటి సినిమాలకు ఓటీటీనే బెటర్. దర్శక నిర్మాతలు మెహర్ తేజ్, తేజ కాజసారపు అదే పనిచేశారు కాబట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను వాచ్ చేయాలనుకునే వారు… దీనిని ఒకసారి చూడండి. ఏదో ఒక అనుభూతికైతే ఖచ్చితంగా లోనవుతారు అది పాజిటివా? నెగెటివా? అని మాత్రం అడగకండి.
ప్లస్ పాయింట్స్:
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
పర్టిక్యులర్ గా చెప్పడం కష్టం
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్ : సైకో డ్రామా!