ఈమధ్య కాలంలో విడుదలైన ప్రతీ పెద్ద సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు ఎంత భారీగా పెంచారో అందరికీ తెలుసు! చివరాఖరికి డబ్బింగ్ సినిమాల రేట్లను సైతం అమాంతంగా పెంచడం జరిగింది. అయితే, టికెట్ రేట్ల హైక్‌తో కేజీఎఫ్: చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాగానే లాభపడ్డాయి. అంచనాలకి మించి ఎంటర్టైన్ చేయడంలో సఫలమయ్యాయి కాబట్టి, జనాలు టికెట్ రేట్లను పట్టించుకోకుండా ఆ సినిమాల్ని చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు.
కానీ, మిగతా సినిమాల విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆశించిన స్థాయిలో మిగిలిన చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో, ‘అంత డబ్బు పెట్టి థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం ఏముందిలే?’ అని అనుకొని మెజారిటీ ఆడియన్స్ బ్యాక్ స్టెప్ వేశారు. టాక్ బాలేదు కదా, ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని.. తేలిగ్గా తీసుకున్నారు. ఒకవేళ టికెట్ ధరలు మునుపటిలాగా తక్కువగా ఉండుంటే, కొద్దోగొప్పో వసూళ్ళైనా వచ్చేవేమో! కానీ, మరీ విపరీతంగా రేట్లు పెంచేయడంతో కొన్ని సినిమాలు ఫస్ట్ వీకెండ్ తర్వాతే తట్టాబుట్టా సర్దేసే దుస్థితికి చేరుకున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. ‘ఆచార్య’ సినిమానే తీసుకోవచ్చు.
అసలే ఈ సినిమాకి తారాస్థాయిలో నెగెటివ్ టాక్ వచ్చింది, దానికితోడు టికెట్ రేట్లు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. దీంతో, అంత డబ్బు వెచ్చించి ఆ సినిమాని థియేటర్లలో చూసేందుకు జనాలు సాహసించలేదు. బహుశా ఈ ఫలితాలన్నింటిపై ఎఫ్3 మేకర్స్ బాగా గణాంకాలు వేసుకున్నట్టున్నారు.. అందుకే తమ చిత్రానికి టికెట్ రేట్లు పెంచకూడదని నిర్ణయించుకున్నారు. మామూలు ధరలకే టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది కచ్ఛితంగా సినీ ప్రియులకి ఊరట కలిగించే విషయమే! టాక్ ఎలా వచ్చినా, టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, కచ్ఛితంగా సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్ళడం ఖాయం!