No Benefit shows: ఆంధ్రప్రదేశ్ లో సినిమా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు టిక్కెట్ రేట్లను పెంచినా, కొందరు ఎగ్జిబిటర్స్ మాత్రం ఫ్యాన్స్ షోస్, బెనిఫిట్ షోస్ కు ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ ఎగ్జిబిటర్స్ అయితే ఇటీవల ఓ మీటింగ్ పెట్టుకుని, అలాంటి షోస్ ను ప్రదర్శకూడదంటూ ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నారు.
ఇటీవల కాకినాడ టౌన్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశమైంది. ఇక మీదట ఏ హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ షోస్, బెనిఫిట్ షోస్ ను తమ థియేటర్లలో ప్రదర్శించకూడదని తీర్మానించుకుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే… వారికి అసోసియేషన్ రూ. లక్ష రూపాయలు జరిమానా విధిస్తుందని, అలానే మిగిలిన ఎగ్జిబిటర్స్ వారికి సహకరించరని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా పంపిణీదారులు బెనిఫిట్ షోస్ కోసం ఒత్తిడి చేస్తే.. అతనికీ భవిష్యత్తులో సహకారం అందించమని తేల్చి చెప్పింది. ఈ లేఖను ఈస్ట్ గోదావరి సినీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కూడా పంపారు. మరి దీనిపై నిర్మాతలు, పంపిణీదారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే… త్వరలో రాబోతున్న సినిమాలలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ఉంది. అది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. దాని బెనిఫిట్ లేదా ఫ్యాన్ షోస్ వేయమని పంపిణీదారులు ఒత్తిడి చేసే ఆస్కారం లేకపోలేదు.