సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో పాటు 3-డీ వర్షన్ కూడా విడుదల కావడం విశేషం.
ఇది 7వేల సంవత్సరాల క్రితం మొదలైన కథ. డివియన్స్ అనే రాక్షసుల కారణంగా ఈ భూమికి, ఇక్కడి జీవరాశులకు ముప్పు ఏర్పడినప్పుడు వారితో పోరాడేందుకు అరిషమ్, ఇటర్నల్స్ ను తయారు చేసి ఈ గ్రహానికి పంపుతాడు. వచ్చిన పని పూర్తి అయినా అరిషమ్ నుండి తమ గ్రహానికి వెళ్ళేందుకు ఆజ్ఞ రాకపోవడంతో ఇక్కడికి వచ్చిన పదిమంది ఇటర్నల్స్ ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలలో తల దాచుకుని సాధారణ జీవితం గడుపుతుంటారు. అయితే తాజాగా డివియన్స్ సరికొత్త శక్తితో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధమౌతాయి. ఈ తాజా ఉపద్రవాన్ని ఇటర్నల్స్ ఎలా ఎదుర్కొన్నారు? గతంలో మానవాళిని నాశనం చేయాలనుకున్నడివియన్స్ ఈ సారి ఇటర్నల్స్ ను ఎందుకు టార్గెట్ చేశాయి? అంతర్గత కలహాలతో ఇటర్నల్స్ కు ఎలాంటి ముప్పు ఏర్పడింది? అనేది మిగతా కథ.
ఇంతవరకూ వచ్చిన మార్వెల్ చిత్రాలలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రం ఇదే. రెండున్నర గంటలకు పైగా సాగే ఈ సినిమా రన్ టైమ్ పెద్ద మైనస్. పైగా ఈ సీరిస్ లో ఇదే తొలి చిత్రం కావడంతో ఇందులో సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ ను ప్రేక్షకులు ఓన్ చేసుకునే అవకాశం తక్కువ. సహజంగా సూపర్ హీరోస్ చిత్రాలు లాజిక్ కు దూరంగా ఉంటాయి. అయితే ఈ తరహా చిత్రాలలో గ్రాఫిక్ విజువల్స్, యాక్షన్, హాస్యం ఈ మూడు ఉంటే అన్ని వర్గాలు వారిని ఇష్టపడుతుంటారు. నిజానికి ఈ మూడూ సినిమాలో ఉన్నాయి. కానీ దర్శకురాలు క్లో జావో తాను ఎంచుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. మనుషులుగా మారి ఈ గ్రహంతో, ఇక్కడి వ్యక్తులతో మమేకమైన ఇటర్నల్స్ ఈ ప్రపంచం నాశనం అవుతుందని తెలిసినప్పుడు దాన్ని అడ్డుకోవాలా వద్దా అనే సంశయంలో పడతారు. వారి మధ్య జరిగే చర్చోపచర్చలకే దర్శకురాలు ఎక్కువ టైమ్ కేటాయించారు. ప్రజలు ఎలా అయితే పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారో, తామూ కూడా అరిషమ్ చేతులో కీలుబొమ్మలమే అని భావించిన కొందరు సహచరులను మిగిలిన ఇటర్నల్స్ మిషన్ కోసం ఒప్పించడంతోనే సగం సినిమా గడిచి పోతుంది. చిత్రం ఏమంటే క్లయిమాక్స్ లో కూడా ఇటర్నల్స్ లో కొందరు తాము హీరోలా లేక విలన్సా అనేది తెల్చుకోలేని సందిగ్థావస్థలో ఉంటారు. ఈ కన్ ఫ్యూజన్ ను క్లియర్ చేయకుండానే సినిమా పూర్తయిపోతుంది.
హాలీవుడ్ సీనియర్ నటీమణులు ఏంజెలీనా జోలి, సల్మా హయక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వారి అభిమానులకు ఈ పాత్రలు నచ్చుతాయి. ఏంజెలీనా జోలీ నుండి ఎలాంటి యాక్షన్ ను వారు ఆశిస్తారో అది పుష్కలంగా ఉంది. సల్మా హయక్ పాత్ర సెంటిమెంట్ తో సాగుతుంది. అలానే జెమ్మా చాన్, రిచర్డ్ మాడెన్, లియా మెక్ హగ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లారెన్ రిడ్లాఫ్ వంటి వారు ఇటర్నల్స్ పాత్రలలో నటించి, మెప్పించారు. పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని ఇందులో హిందీ చిత్రాల కథానాయకుడిగా స్థిరపడిన కింగో అనే ఇటర్నల్ గా నటించాడు. అతని సహాయకుడి పాత్రను భారతీయ నటుడు హరీశ్ పటేల్ చేశాడు. వీరిద్దరూ ఉన్న సన్నివేశాలు చక్కని వినోదాన్ని పండించాయి. కథానుగుణంగా కొంత భాగాన్ని ఇండియాలోనూ చిత్రీకరించారు. భారతీయ వివాహం, జీవనంకు సంబంధించిన రెండు మూడు కీలక సన్నివేశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
సహజంగా సూపర్ హీరోలో ఉండే యూనిక్ క్వాలిటీస్ అన్నింటినీ ఒకరిలోనే ఇవ్వకుండా ఇక్కడ ఒక్కో వ్యక్తికి ఒక్కో స్పెషల్ పవర్ కట్టబెట్టారు. మైండ్ ను కంట్రోల్ చేసే శక్తి ఒకరికి ఉంటే, సూపర్ స్పీడ్ మరొకరికి ఉంటుంది. అత్యంత బలం ఒకరి సొంతమైతే, రోగాలను క్షణాల్లో తగ్గించే శక్తి మరొకరికి ఉంటుంది. అలానే మాయా కత్తులను దూసే చాతుర్యం ఒకరిదైతే, కనికట్టు చేయగలిగేవారు మరొకరు. ఇలా పది మంది ఇటర్నల్స్ కు పది రకాల శక్తులను పెట్టారు. నిజానికి దానితోనే బోలెడంత వినోదాన్ని రాబట్టవచ్చు. కానీ దర్శకురాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒకరిద్దరి శక్తులను మాత్రం కథానుగుణంగా కొన్ని సన్నివేశాలలో చూపించారు. అత్యంత భారీ వ్యయంతో తీసిన ‘ఇటర్నల్’కు సీక్వెల్ కూడా ఉండబోతోందనే విషయాన్ని ముగింపులో స్పష్టం చేశారు. విజువల్స్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ ను ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. కానీ భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుని థియేటర్ కు వెళితే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.
ప్లస్ పాయింట్స్:
సూపర్ హీరోస్ మూవీ
యాక్షన్ సీన్స్
విజువల్స్ ఎఫెక్ట్స్
మైనెస్ పాయింట్స్:
ఆసక్తి కలిగించని కథనం
మూవీ రన్ టైమ్
రేటింగ్ : 2.25 / 5
ట్యాగ్ లైన్: కొంతమాత్రమే సూపర్!