నటభూషణ శోభన్ బాబు హీరోగా కొన్ని నవలా చిత్రాలు తెలుగువారిని అలరించాయి. మాదిరెడ్డి సులోచన రాసిన ‘మిస్టర్ సంపత్ ఎమ్.ఎ.’ నవల ఆధారంగా తెరకెక్కిన శోభన్ బాబు చిత్రం ‘ఈతరం మనిషి’. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం, అతని మిత్రుడు కె.రవీంద్రనాథ్ కలసి ఈ చిత్రాన్నినిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘ఈతరం మనిషి’ తెరకెక్కింది. 1977 ఫిబ్రవరి 10న ‘ఈతరం మనిషి’ జనం ముందు నిలచింది.
‘ఈతరం మనిషి’ కథ ఏమిటంటే – రవి ఎమ్.ఏ. చదివిన చురుకైన కుర్రాడు. అతణ్ణి చదవించడానికి తల్లి ఎంతో కష్టపడి ఉంటారు. దాంతో తల్లిని బాగా చూసుకోవాలని పలుచోట్ల ఉద్యోగాలకు ప్రయత్నిస్తాడు. అతని నిజాయితీ, నిప్పులాంటి వ్యక్తిత్వం అడ్డంకులవుతాయి. చివరకు సరోజ అనే ధనవంతురాలు కొడుక్కి ట్యూషన్ మేస్టర్ గా సెట్ అవుతాడు రవి. ఆమె భర్త రావు పెద్ద కోటీశ్వరుడు. ఇక రవి, తనకు మామ వరుస అయ్యే ఆయన కూతురు జయని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలను కుంటారు. కానీ, సరోజకు అన్నీ ఉన్నా తీరని కోరికలు ఉంటాయి. సమాజంలో మగవాడు అనిపించుకోవడానికి ఆమె భర్త, ఆ అందాల రాశిని పెళ్ళాడి ఉంటాడు. అంతే తప్ప, వారి మధ్య శారీరక సంబంధం ఉండదు. అలా అన్నీ ఉన్నాకోరికలతో కాగిపోతున్న సరోజకు, రవిపై మనసు మరలుతుంది. తన కథ రవికి చెబుతుంది. దాంతో రవి అక్కడ ఉద్యొగం మానేస్తాడు. జయ తండ్రి తన కంపెనీలోనే మేనేజర్ గా ఉండమంటాడు. అయితే, వ్యాపారం అన్న తరువాత ఎంతో కొంత అవినీతి ఉంటుందని అందువల్ల చేయనంటాడు రవి. ఎమ్.ఏ. చదివినా సంతృప్తి కలిగించే కూలి పని చేస్తుంటాడు రవి. అతని నిజాయితీ మెచ్చి, సరోజ మళ్ళీ చేరదీస్తుంది. సరోజ అంటే పడిచచ్చే వారంతా రవిపై అసూయ పెంచుకుంటారు.
జయ తండ్రి ఇన్ కమ్ టాక్స్ బారిన పడి ఆస్తిపాస్తులు అమ్మినా కట్టలేని పరిస్థితి వస్తుంది. రవి ఓ షిప్పింగ్ కంపెనీ మొదలు పెడతాడు. అతనితో సరోజ భర్త రావు మిత్రులందరూ షేర్స్ కలుపుతారు. కుటుంబ పోషణ కోసం జయ, రవి షిప్పింగ్ కంపెనీలోనే క్లర్క్ గా చేరుతుంది. అక్కడ సరోజను చూసి అపార్థం చేసుకుంటుంది. రవి తెలివిగా జయను కూడా ఆ కంపెనీలో భాగస్వామిని చేస్తాడు. కానీ, ఆమె మాత్రం రవికి, సరోజకు మధ్య ఏదో ఉందని అనుమానించి, అందులో భాగస్వాములైన ఇతరులకు విషయాలు చేరవేస్తుంది. రావు రవిని చంపాలనుకుంటాడు. అతని చేతిలోని రివాల్వర్ పేలి అతనే చనిపోతాడు. కొందరు రవి షిప్ లో దొంగ సరుకు రవాణా చేయాలను కుంటారు. వారి ఆట కట్టించి, వారిని చట్టానికి అప్పచెబుతాడు రవి. సరోజను అపార్థం చేసుకున్నందుకు అందరూ పశ్చాత్తాప పడతారు. రవి, జయకు ఎప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని చెబుతుంది సరోజ. తన కొడుకును కూడా ఈతరం మనిషిగా తీర్చిదిద్దాలని రవిని కోరుతుంది సరోజ. దాంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో లక్ష్మి, జయప్రద, గుమ్మడి, రావు గోపాలరావు, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు, ప్రభాకర్ రెడ్డి, అంజలీదేవి, నిర్మలమ్మ, హలం, మాదాలరంగారావు, చలపతిరావు, భీమరాజు తదితరులు నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర పాటలు పలికించారు. ఆచార్య ఆత్రేయ మాటలు కూడా రాసి ఆకట్టుకున్నారు. “నవనవలాడే లే జవరాలు చెవిలో ఏదో చెప్పింది…”, “ఇచ్చేశా నా హృదయం తీసుకో…”, “ఓ కోమలి… నా జాబిలి… ఓ నవయవ్వన రాశీ…”, “మావూరొస్తే ఏమి తెస్తావ్… మీ ఊరొస్తే ఏమి తీస్తావ్…”, “ఎంత షోగున్నావే కిలాడీ గుంటా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనేరు రవీంద్రనాథ్ లక్ష్మికి డ్యాష్ ఇచ్చే సీన్ లో కనిపిస్తారు. తరువాతి రోజుల్లో కోనేరు రవీంద్రనాథ్ కూడా తన అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించారు.
ఈ చిత్రానికి ముందు శోభన్ బాబుతో పల్లవి ఫిలిమ్స్ నిర్మించిన ‘ఇద్దరూ ఇద్దరే, అందరూ దొంగలే’ జనాన్ని అలరించాయి. శోభన్ బాబు పుట్టినరోజయిన జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పుడే ఓ సంఘటన జరిగింది. ఈ సినిమా విషయంలో ఇప్పటికీ ఆ విషయాన్ని కొందరు చెప్పుకుంటూనే ఉంటారు. అదేమిటంటే- అప్పట్లో ఇప్పటిలా సెన్సార్ ఉండేది కాదు. ఓ లైన్ ప్రకారం ముందుగా ఎవరు డేట్ ఫిక్స్ చేసుకుంటే వారి చిత్రాలకే సెన్సార్ ఉండేది. అదే సమయంలో యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దానవీరశూరకర్ణ’ సెన్సార్ కావలసి ఉంది. అయితే వారు బుక్ చేసుకున్న డేట్ కు సెన్సార్ అయితే, అనుకున్న ప్రకారం ఆ యేడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయలేరు. అందువల్ల ఇతరులకు బుక్ అయిన డేట్ లో వారు తప్పుకుంటే వేరేవారు ఆ డేట్ కు సెన్సార్ చేయించుకోవచ్చు. అలా ‘ఈతరం మనిషి’ లైన్ లో నుండి తప్పుకొని, ‘దానవీరశూర కర్ణ’కు దారిచ్చింది. అందుకు యన్టీఆర్ కృతజ్ఞతగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన యస్.వెంకటరత్నంకు కాల్ షీట్స్ ఇచ్చారు. తత్ఫలితంగా రూపొందిన చిత్రమే ‘యమగోల’. అందులోనూ జయప్రద నాయికగా నటించడం, ఆ చిత్రానికి కూడా చక్రవర్తి సంగీతం సమకూర్చడం ఆ తరువాత ఆ సినిమా సంచలనం విజయం సాధించడం అలా అలా జరిగిపోయాయి. ఇక అప్పుడు సెన్సార్ క్యూ నుండి తప్పుకున్న ‘ఈతరం మనిషి’ తరువాత సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న జనం ముందు నిలిచింది.