J.D. Chakravarthy: మన చిత్రాలు, మన నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. దేశవిదేశాల్లోని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో మన చిత్రాలు ప్రదర్శితమౌతున్నాయి. తాజాగా నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన హీరో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. జేడీ చక్రవర్తి హీరోగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన అవార్డు లభించింది. ‘దహిణి : ది విచ్’ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జేడీ చక్రవర్తికి ఈ అవార్డు లభించింది. దీంతో అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముందు ఆస్ట్రేలియాలోనూ ‘దహిణి : ది విచ్’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవి పున్నం సంభాషణలు రాశారు. ఇప్పటి వరకూ 18 అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా అందుకుంది.