Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక మహనటి. ఒక సీతారామం ఈ రెండు సినిమాలు చాలవా దుల్కర్ ఎలాంటి నటుడో తెలుసుకోవడానికి.. కానీ, సక్సెస్ వచ్చాకే ఆ విషయం బయటికి వస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి జరిగేదే. ఒక స్టార్ హీరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా దుల్కర్ కు అవమానాలు తప్పలేదు.. నీ తండ్రి పేరును నువ్వు కాపాడలేవు అని కొందరు.. నీ ముఖానికి సినిమాలా అని మరికొందరు హేళన చేసిన రోజులు ఉన్నాయని దుల్కర్ చెప్పడం విశేషం. ప్రస్తుతం దుల్కర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం చుప్.. విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాలకు చెత్త రివ్యూలను ఇచ్చేవారిని చంపేసే సైకో పాత్రలో దుల్కర్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ స్టార్ హీరో గతంలో తాను అనుభవించిన మానసిక క్షోభను చెప్పుకొచ్చాడు.
“కెరీర్ ప్రారంభంలో నా సినిమాలకు వచ్చిన రివ్యూలు చదివేవాడిని. అందరు నా నటన బాగోలేదని రాసేవారు. కొన్నిసార్లు వాటిని నేను తీసుకోలేకపోయేవాడిని. నాకు యాక్టింగ్ రాదని, నేను నా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టలేనని చెప్పేవారు.. మరికొంతమంది అసలు ఇతనికి సినిమాలు అవసరమా.. యాక్టింగ్ కు పనికిరాడు.. ఇతను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకుంటున్నాం అని రాసేవారు.. ఆ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. కానీ, దాని నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం సీతారామం తరువాత దుల్కర్ వరుస తెలుగు ప్రాజెక్ట్స్ ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.