శాండిల్ ఉడ్ లో పరిచయం అవసరం లేని పేరు ఎంజీ శ్రీనివాస్ (శ్రీని). హీరోగా, డైరెక్టర్ గా కన్నడలో ‘బీర్బల్’ ట్రయాలజీ, ‘ఓల్డ్ మోంక్’ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీను. తాజా ‘ఆన్ ఎయిర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడీయన. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమాను రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. ఇవాళ ఎంజీ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ఇందులో శ్రీని రేడియో జాకీ పాత్రను పోషిస్తున్నాడు. ఆర్జేగా చేరిన మొదటి రోజే వచ్చిన ఒక కాల్ తో అతని జీవితంలో ఎలాంటి పెను మార్పులు చోటుచేసుకున్నాయన్నదే ఈ చిత్రకథ. స్క్రీన్ ప్లే వినూత్నంగా ఉంటుందని, శ్రీని ఆర్జీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారని, తన నటనతో ఈ థ్రిల్లర్ మూవీని మరో లెవల్ కు తీసుకెళ్ళాడని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెబుతున్నాడు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”’ఆన్ ఎయిర్’ ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఖాయం. దర్శకుడు ప్రశాంత్ సాగర్ 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. ఈ మూవీ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. అలానే అతి త్వరలో ఒక టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ మూవీని విడుదల చేస్తాం” అని చెప్పారు.