ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ లాంటి కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన దివ్య శ్రీపాద ‘కలర్ ఫోటో’ మూవీతో మంచి గుర్తింపును పొందింది. అలానే గత యేడాదే వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో సెల్ ఫోన్ షాప్ సేల్స్ గర్ల్ గా నటించి మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ అందాల నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విశేషం ఏమంటే… రాహుల్ విజయ్, శివాత్మిక, స్వాతిరెడ్డి, సముతిర ఖని, బ్రహ్మానందం, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘పంచతంత్రం’ మూవీలో దివ్య శ్రీపాద… దేవి అనే పాత్రలో అలరించబోతోంది. ఈ పాత్ర గురించి దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ “మా సినిమాలో కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపిస్తారు. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నాం. అన్నిటి కంటే దేవి పాత్ర చాలా ప్రత్యేకం. చాలా సదాసీదాగా, అమాయకంగా కనిపించే దేవి… ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే క్రమంలో ఆమె ధైర్యం కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారు” అని చెప్పారు.
Read Also : ‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!
ఇక చందు సాయి దర్శకత్వంలో రజినీ రెడ్డి నిర్మిస్తున్న ‘చరిత కామాక్షి’ మూవీలో దివ్య శ్రీపాద హీరో నవీన్ బెత్తిగంటి సరసన నాయికగా నటిస్తోంది. చక్కటి చీరకట్టులో గృహిణి పాత్రలో, చూడగానే గౌరవం ఉట్టిపడేలా చిరునవ్వు చిందుస్తున్న దివ్య శ్రీపాద పోస్టర్ ను ఈ టీమ్ ఆదివారం విడుదల చేసింది. దివ్య శ్రీపాద పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల యూనిట్స్ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం విశేషం. మొత్తానికి చాలా సైలెంట్ గా దివ్య శ్రీపాద టాలీవుడ్ లో తన ప్రతిభతో దూసుకుపోతోందని చెప్పాలి.