ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే!
గోదావరి అంటే వంశీకి ప్రాణం. ఎందుకంటే ఆయన గోదావరి నదీతరంలో పుట్టినవారు. 1956 నవంబర్ 20న తూర్పు గోదావరి జిల్లా పసలపూడి అనే గ్రామంలో వంశీ కన్నుతెరిచారు. పలక, బలపం, కలం, కాగితం అన్నీ అక్కడే పట్టేశారు. రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లో పై చదువులు సాగించారు. ఎక్కడ ఏ పుస్తకం కంటికి నచ్చినా, కళ్ళకు విరామం ఇవ్వకుండా చదివేసేవారు. కథలు, కవితలు పలికించడం మొదలెట్టారు. పలు వారపత్రికల్లో అవి ప్రచురితం కాగానే పరవశించి పోయేవారు. ఆ కలం బలాన్నే నమ్ముకొని చెన్నపట్నం చేరి, తొలుత వి.మధుసూదనరావు వద్ద, ఆ తరువాత కె.విశ్వనాథ్ కు సహాయ దర్శకునిగా పనిచేశారు. వంశీ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే అతనిలోని సృజన చూసి ముచ్చట పడ్డవారిలో వేమూరి సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు వంశీని దర్శకునిగా చూడాలన్న అభిలాష! ఆయన ప్రోత్సాహంతోనే ‘మంచుపల్లకి’తో వంశీ దర్శకుడై పోయారు. తొలి చిత్రమే రీమేక్. ‘మంచుపల్లకి’కి తమిళంలో రూపొందిన ‘పాలైవన సోలై’ ఆధారం! తెలుగులో తన సృజన చూపిస్తూనే మురిపించారు. కానీ, ‘మంచుపల్లకి’ కదా ఏ ఊళ్ళోనూ ఎక్కువ రోజులు చూడకుండా కరిగిపోయింది. అయితే అప్పటి యువతకు వంశీ సినిమా తీసిన పద్ధతి భలేగా నచ్చేసింది. వంశీ నిరాశను దూరం చేస్తూ, ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన దర్శకత్వంలో ‘సితార’ తీశారు. అప్పుడే వంశీ మార్కు సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ కూడా తోడైంది. ‘సితార’ చిందేసి జనానికి కనువిందు చేసింది.
తరువాత ‘అన్వేషణ’- ఇది అపరాధ పరిశోధన చిత్రం. అయినా, జనాన్ని కట్టిపడేసేలా చేశారు వంశీ, ఇళయరాజా. మరో విజయం వంశీ చెంత చేరింది. ‘ప్రేమించు పెళ్ళాడు’తో రాజేంద్రప్రసాద్ ను హీరోని చేసేశారు వంశీ. మళ్ళీ ఇళయరాజా బాణీలతో వీనులవిందు చేశారు. కానీ, జనం ఆ చిత్రాన్ని అంతగా ప్రేమించలేకపోయారు. ‘ఆలాపన’లోనూ ఇళయరాజా స్వరాలు, వంశీ చిత్రీకరణ పోటీపడ్డాయి. వాటికి తగ్గ రీతిలో భానుప్రియ నాట్యం సాగింది. రాజేంద్రప్రసాద్ ను హీరోగా నిలిపిన చిత్రం ‘లేడీస్ టైలర్’. దీనికీ వంశీ, ఇళయరాజా కాంబోనే కనికట్టు చేసింది. ఈ సారి గురితప్పలేదు ‘జహిజట్’ పట్టేశారు.
వంశీ తెరకెక్కించిన “మహర్షి, శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, డిటెక్టివ్ నారద” చిత్రాల బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ఇళయరాజా సంగీతం మాత్రం భలేగా ఆకట్టుకుంది. రాజా నుండి వంశీ ట్యూన్స్ రాబట్టే పద్ధతే చిత్రం విచిత్రం అని చెప్పవచ్చు. ఇళయరాజా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఒకటి రెండు వర్షన్స్ కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు. తాను ఇచ్చిందే పుచ్చుకోవాలని అన్న తీరున రాజా సాగుతున్న రోజులవి. ఆ రోజుల్లోనూ ఇళయరాజా నుండి మరపురాని మధురాన్ని రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నది ఒక్క వంశీ అనే చెప్పాలి. తనను చిత్రసీమకు పరిచయం చేసిన వారికి కూడా ఇళయరాజా అన్ని ట్యూన్స్ వినిపించి ఉండరు. ఎందుకనో వారిద్దరి బంధం అలా సాగింది.
‘జోకర్’ సినిమాతో వంశీనే మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. తరువాత “కన్నయ్య-కిట్టయ్య, ప్రేమ అండ్ కో, నాకు 16 నీకు 18, లింగబాబు లవ్ స్టోరీ” చిత్రాలకూ వంశీ బాణీలు కట్టారు. కానీ, ఆ సినిమాలు సక్సెస్ బోనీ కొట్టలేకపోయాయి. కొన్ని చిత్రాలలో పాటలూ పలికించారు. మరికొన్ని సినిమాల్లో గానమూ వినిపించారు. ఇక ఆయన రచనలకు కొదువేలేదు. సినిమాలు ఉన్నా లేకున్నా రచనలు మాత్రం ఆపకుండా సాగిస్తూనే ఉన్నారు.
వంశీ బహుముఖ ప్రజ్ఞకు అడపా దడపా బ్రేక్ పడ్డ సందర్భాలున్నాయి. అయినా ఆయన సృజనాత్మకతను ప్రేమించేవారు, మళ్ళీ వంశీ తన మార్కు చూపిస్తాడు అనే ఆశిస్తున్నారు. 2017లో ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమా తీశాక, మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు వంశీ. ఇప్పుడు వంశీ ఓ సినిమా చేయబోతున్నాడని విశేషంగా వినిపిస్తోంది. మరి అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో? ఈ విషయం వంశీ అభిమానులకు మాత్రం ఆనందం పంచుతోంది. మళ్ళీ వంశీ మార్కు సినిమా చూడబోతామని వారిలో ఆసక్తి పెరుగుతోంది.