Director Parasuram To Narrate A Story To Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈమధ్య సినిమాల పరంగా స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే! ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని ఆయన వరుసగా లైన్‌లో పెడుతున్నారు. ఆల్రెడీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయన ఖాతాలో మరో సినిమా చేరబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ దర్శకుడే ధృవీకరించాడు. అతనెవరో కాదు.. మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేసిన పరశురామ్. ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆ విషయం చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యతో పాటు పరశురామ్ కూడా అతిథిగా విచ్చేశాడు. వేదికపై మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మొదటగా బాలయ్యకు నమస్కారం చెప్పాడు. ఆ వెంటనే ఓ అద్భుతమైన కథతో మీ వద్దకి రాబోతున్నానని, ఈ విషయం ఆల్రెడీ అల్లు అరవింద్‌కి తెలుసని చెప్పాడు. చూస్తుంటే.. బాలయ్య, పరశురామ్ మధ్య కూడా ఇంతకుముందే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందుకే, వేదికపై అంత నమ్మకంతో ఓ బలమైన కథతో రాబోతున్నామని పరశురామ్ చెప్పినట్లు అర్థమవుతోంది. ఇంతవరకు పరశురామ్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, పూర్తిస్థాయి మాస్ సినిమా అయితే తీయలేదు. మహేశ్ బాబుతో చేసిన సినిమాలో ఫైట్లు ఉన్నా, అందులో క్లాస్ టచ్ ఎక్కువ ఉందనే కామెంట్లే వినిపించాయి. మరి, బాలయ్య కోసం ఎలాంటి కథని సిద్ధం చేశాడో చూడాలి.
కాగా.. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. కన్నడ నటుడు దునియా విజయ్, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా ఇది రూపొందింది కాబట్టి, ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.