దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు.
మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల నరసింగరావు చదువు సవ్యంగా సాగింది. ఆయన మనసు లలిత కళల పట్ల మొగ్గు చూపింది. అలా చిత్రలేఖనంలో ప్రావీణ్యం సంపాదించిన నరసింగరావు, తరువాత చిత్రసీమవైపూ అడుగులు వేశారు. నిజాం నిరంకుశత్వానికి బలైపోయిన బడుగు జీవుల కథలను చదివారు నరసింగరావు. ముఖ్యంగా కిషన్ చందర్ తెలంగాణలోని జనజీవనంపై రాసిన రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. కిషన్ రాసిన కథకు ‘మా భూమి’ మకుటంతో నరసింగరావు స్క్రీన్ ప్లే రాశారు. దానినే జి.రవీంద్రనాథ్ తో కలసి ‘మా భూమి’ చిత్రంగా నిర్మించారు. ఈ చిత్రానికి బెంగాలీ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించారు. సాయిచంద్ ప్రధాన పాత్ర పోషించిన ‘మా భూమి’లో ప్రజాకవుల పాటలనే ఉపయోగించుకున్నారు. బండి యాదగిరి రాసిన ‘బండెనక బండి కట్టి…’ పాటను సినిమాలో గద్దర్ పాడుతున్నట్టుగా చిత్రీకరించారు. ఇక సుద్దాల హనుమంతు రాసిన “పల్లెటూరి పిల్లగాడా… పసలు గాసె మొనగాడా…” పాటనూ ఇందులో ఉపయోగించారు. 1980లో విడుదలైన ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో విశేషాదరణ చూరగొంది. హైదరాబాద్ లో సంవత్సరం పాటు ‘మా భూమి’ ప్రదర్శితమయింది. ఈ సినిమాతో నరసింగరావుకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డూ లభించింది.
‘మా భూమి’ విజయం నరసింగరావులో ఆత్మవిశ్వాసం నెలకొల్పింది. స్వీయ దర్శకత్వంలో ‘రంగుల కల’ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో ముఖ్యపాత్రనూ పోషించారు. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు సంపాదించింది. “ది కార్నివాల్, ది సిటీ” అనే రెండు డాక్యుమెంటరీ మూవీస్ ను తెరకెక్కించారు. ఈ చిత్రాలు అంతర్జాతీయ యవనికపై ప్రదర్శితమై నరసింగరావులో మరింత ఉత్సాహం నింపాయి. ‘మా ఊరు’ చిత్రంలో అసలైన మట్టివాసనను జనానికి రుచిచూపించారు. ఈ చిత్రానికి ‘బెస్ట్ ఆంథ్రోపాలజికల్ మూవీ’గా నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రం తరువాత అర్చన ప్రధాన పాత్రలో ‘దాసి’ రూపొందించారు నరసింగరావు. ఈ సినిమాతో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. అర్చనను ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిపింది. మరో నాలుగు నేషనల్ అవార్డులనూ అందుకుంది ‘దాసి’. అర్చన ముఖ్యభూమికలోనే ‘మట్టి మనుషులు’ రూపొందించారు నరసింగరావు. ఈ సినిమా మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో డిప్లొమా ఆఫ్ మెరిట్ సొంతం చేసుకుంది. అంతకు ముందు నరసింగరావు తెరకెక్కించిన ‘ఆకృతి’ కూడా అవార్డులు అందుకుంది. 1983 నుండి 1990 దాకా ప్రతి యేడాది తన అభిరుచిని చాటుకుంటూ చిత్రాలను రూపొందించిన నరసింగరావు, ‘మట్టి మనుషులు’ తరువాత ఎందుకనో సినిమా రూపకల్పనకు దూరంగా జరిగారు. దాదాపు 13 ఏళ్ళ తరువాత 2003లో డి.రామానాయుడు , నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ అనే చిత్రాన్ని నిర్మించారు. కేన్సర్ వ్యాధితో బాధపడే ఓ చిన్నారి స్నేహాన్ని, ప్రేమను కోరుకోవడం, అందుకు తగ్గ వాతావరణం కోసం ఆమె ఎదురుచూపులతో కథ సాగుతుంది. ఈ చిత్రం అంతగా అలరించలేకపోయింది.
నరసింగరావుకు సినిమా అంటే ప్రాణం. తన మనసును ఆకట్టుకున్న ఏ భాషా చిత్రాన్నయినా మిత్రులకూ చూపించాలని తపించేవారు. హైదరాబాద్ ఫిలిమ్ క్లబ్ ఏర్పాటులో నరసింగరావు పాత్ర ఎంతోఉంది. ఈ క్లబ్ ద్వారా హైదరాబాద్ లోని సినిమా అభిమానులకు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలచిన పలు చిత్రాలను అందించడంలో నరసింగరావు కీలక పాత్ర పోషించారు. మెయిన్ స్ట్రీమ్ కు దూరంగా నరసింగరావు చిత్రాలు రూపొందినా, అభిరుచిగల ప్రేక్షకులను ఆయన సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 26తో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నరసింగరావు మరిన్ని వసంతాలు ఆనందంగా చూడాలని ఆశిద్దాం.