గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉన్న ఒకే ఒక్క టాపిక్, ఒకేఒక్క ట్రెండ్ ‘#wedontwanttheriremake’. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపు రెండున్నర లక్షల ట్వీట్స్ వేసి ట్విట్టర్ ని షేక్ చేశారు. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని ఎవరూ వాడుకోవట్లేదు, అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమాని అనౌన్స్ చేయగానే మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఒక కొత్త కథలో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నాం అని సంబరపడ్డారు కానీ అది కొంత కాలం మాత్రమే మిగిలింది. హరీష్ శంకర్ చేసేది కొత్త కథ కాదు, అది తమిళ ‘తెరి’ సినిమా రీమేక్ అనే రూమర్ బయటకి రాగానే మెగా అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
ఆల్రెడీ తెలుగులో ‘పోలీసోడు’ అనే పేరుతో వారానికి ఒకసారి టీవీలో వచ్చే సినిమాని పవన్ కళ్యాణ్ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా హరీష్ శంకర్ లాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏ, ఇలా పవన్ తో రీమేక్ సినిమా చేయడం అభిమానులని ఇంకా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఎవరిని అడగాలో అర్ధం కాకా ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ‘తెరి’ రీమేక్ చేస్తే అభిమనులమే పవన్ సినిమాని బాన్ చేస్తాం అంటూ ఫాన్స్ హంగామా చేశారు. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్, తన సినిమా పూజా కార్యక్రమాలని చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. రేపు అఫీషియల్ గా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల సినిమా లాంచ్ అవ్వనుంది. ‘తెరి’ సినిమాలోని లైన్ ని మాత్రమే తీసుకోని కథని పూర్తిగా పవన్ స్టైల్ లోకి మార్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో ‘తెరి’ సినిమానే రీమేక్ చేస్తున్నాడా? లేక కొత్త కథతో సినిమా చేస్తున్నాడా అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.