Dil Raju: లైగర్ ఫ్లాప్ అయ్యాక పూరీ జగన్నాథ్‌తో చేయాల్సిన ‘జన గణ మన’ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలుత ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, ఇప్పుడు సీన్‌లోకి దిల్ రాజు వచ్చాడు. సమంతతో విజయ్ చేస్తున్న ‘ఖుషీ’ సినిమా ముగిసిన వెంటనే, ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ కూడా వేసుకున్నారు. అయితే, ఇంతలో దిల్‌రాజు దర్శకుడికి ఒక చిన్న ఝలక్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని, గౌతమ్‌కి సూచించాడట!
సినిమాలపై మంచి పట్టు ఉన్న నిర్మాతల్లో.. దిల్‌రాజు ఒకడని చెప్పుకోవడంలో సందేహం లేదు. ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి? ఏయే హీరోలకు ఎలాంటి స్టోరీలు సెట్ అవుతాయి? ఏ హీరో నుంచి జనాలు ఏం కోరుకుంటారు? అనే విషయాలపై ఆయనకు పట్టు ఉంది. అందుకే, ఈయన నిర్మించిన సినిమాల్లో కొన్ని మాత్రమే ఫ్లాప్ అయితే, మిగతావన్నీ భారీ విజయాలు సాధించాయి. తనకున్న ఆ అనుభవంతోనే.. విజయ్ ఇమేజ్‌కి తగినట్టు కొన్ని ఎలిమెంట్స్ జోడించాలని, స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో.. డైరెక్టర్ గౌతమ్ స్క్రిప్టుకి మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఎలాగో ఖుషీ సినిమా పూర్తవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఆలోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయడానికి వీలుంటుంది.
ఇకపోతే.. గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌తో పాటు రామ్ చరణ్‌తోనూ ఒక సినిమా చేయబోతున్నాడు. శంకర్‌తో చేస్తున్న సినిమా ముగిసిన వెంటనే, ఆ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దాన్ని రూపొందించబోతున్నాడు. అటు, విజయ్‌తో చేయబోయే చిత్రాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కించబోతున్నారని సమాచారం.