నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది.
‘ధర్మక్షేత్రం’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుడు బెనర్జీ చట్టం, ధర్మం, న్యాయం అన్నవి సామాన్యులను, అమాయకులను కాపాడడానికే అని నమ్ముతూ ఉంటాడు. దానిని తు.చ. తప్పక పాటిస్తూ ఉంటాడు. ఆ నగరంలో దుర్గ, పాండు అనే ఇద్దరు రౌడీల కారణంగా అమాయకులు బలి అవుతూ ఉంటారు. ఆ విషయం తెలిసినా, వారికి ఉన్న రాజకీయ అండదండలకు భయపడి ఎవరూ ఏమి చేయలేరు. జడ్జి సైతం నిస్సహాయంగా ఉంటారు. ఆ సమయంలో బెనర్జీ న్యాయాన్ని పరిరక్షిస్తూనే, ఆ నీచులను అంతమొందిస్తాడు. దుర్గ, పాండు కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా, వారిని రక్షించడానికే పూనుకున్న న్యాయవాదులు, బెనర్జీ వారిని హత్య చేయగానే, అతణ్ణి దోషిగా చూపి శిక్షించమని వాదిస్తారు. దాంతో బెనర్జీ కోర్టులో ధర్మాన్ని రక్షించడానికి తన లాంటి ఓ ప్రాణం పోయినా, లక్షలాది ప్రాణాలు స్వేచ్ఛగా జీవిస్తాయని చెబుతాడు. తనకు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవించడానికి సిద్ధమేనని అంటాడు. దాంతో కథ ముగుస్తుంది.
ఇందులో బెనర్జీగా బాలకృష్ణ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. దివ్యభారతి నాయికగా నటించింది. మిగిలిన పాత్రల్లో జగ్గయ్య, రామిరెడ్డి, దేవన్, నాజర్, శ్రీహరి, బ్రహ్మాజీ, సాక్షి రంగారావు, ప్రసన్న కుమార్, పోసాని కృష్ణమురళి, జయలలిత, జ్యోతి, సుధారాణి, రాధాబాయి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, వేటూరి, సిరివెన్నెల పాటలు పలికించారు.
ఇళయరాజా బాణీల్లో రూపొందిన ఆరు పాటలూ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. “ఎన్నో రాత్రులొస్తాయి కానీ…”, “చెలి నడుమే అందం…”, “ముద్దులతో శృంగార బీటు…”, “కొరమీను కోమలం…సొరచేప శోభనం…” పాటలను వేటూరి రాయగా, “అరె ఇంకా జెంకా…”, ” పెళ్ళికి ముందు ఒక్కసారి…” పాటలను సిరివెన్నెల అందించారు. సినిమా విడుదలకు ముందే సంగీతం పరంగా అభిమానులను విశేషంగా అలరించింది ఈ చిత్రం. దాంతో ‘ధర్మక్షేత్రం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తరువాత అంతగా అలరించలేక పోయిందీ సినిమా.