యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్‌నుమా దాస్’తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. కరాటే రాజు నిర్మిస్తున్న ఈ రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక.
‘ఇందులో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్ కూడా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్సెస్ థ్రిల్ ను కలిగిస్తాయ’ని విశ్వక్ సేన్ తెలిపారు. ‘ఇప్పటికే 95 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ‘ఆర్‌ఆర్‌ఆర్, హరిహర వీరమల్లు’ చిత్రాలకు స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారని, దీనికోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేశామని, ఈ వారంలో ఆ చిత్రీకరణ పూర్తవుతుంద’ని నిర్మాత కరాటే రాజు చెప్పారు. ‘ఫుకెట్ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్ ను, స్పెయిన్ లో ఒక చిన్న షెడ్యూల్ ను పూర్తి చేశామని, దీపావళికి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తామ’ని నిర్మాత అన్నారు. ‘బింబిసార’ చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్ కు కొరియోగ్రఫీ చేయగా, వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను పర్యవేక్షించారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.