‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిచ్చగాడు చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ సంపాదించారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. విజయ్ సినిమాలకు టాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా తెలుగు చిత్ర పంపిణీదారులు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విభిన్న కాన్సెప్ట్ చిత్రాలతో వస్తున్న విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’ తరువాత అంతటి సక్సెస్ రాలేదు. కానీ ఆ తరువాత వచ్చిన పోలీస్ డ్రామా రోషగాడు కొంతవరకు అంచనాలను అందుకోగలిగింది. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఏడాది మే 14న రంజాన్ కానుకగా రానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాదాపు ఐదు భాషల్లో ‘విజయ రాఘవన్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అన్ని సినిమాలలాగే ‘విజయ రాఘవన్’ కూడా వాయిదా పడుతుందని అంతా భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.