దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన రామ్ చరణ్, ఎన్టీయార్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడో, అప్పటి నుంచి ఇండియాలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే పర్ఫెక్ట్ స్టోరీలు దొరకాలి. హీరోలిద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ కావాలి. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తే చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రభాస్ – రామ్ చరణ్
తెలుగుతో పాటు పాన్ ఇండియాలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ ఇద్దరు నటులు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అంటూ అటు రామ్ చరణ్, ఇటు ప్రభాస్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్లిద్దరికీ జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకోవడమే తప్ప, ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కునే పనులు చేయలేదు. వీళ్లిద్దరూ సినిమాల కోసం విపరీతంగా కష్టపడుతుంటారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారు. అందుకే వీళ్లిద్దరికీ హీరోలుగానే కాకుండా, వాళ్ళ వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మంది అభిమానులుగా మారుతున్నారు. ఫ్యూచర్ లో వీళ్లిద్దరి కాంబోలో సినిమా వర్కౌట్ అయితే చూడటానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఎన్టీయార్ – మహేష్ బాబు
ఎలాంటి క్యారెక్టర్ లో అయినా నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుల్లో ఎన్టీయార్, మహేష్ బాబులు మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే చూడటానికి వాళ్ళ అభిమానులతో పాటు, యావత్ ఇండియన్ ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. నిజ జీవితంలో వీళ్లిద్దరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎన్టీయార్, మహేష్ బాబును ‘అన్న’ అని పిలుస్తుంటాడు. అలాగే నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలను కలిపి స్క్రీన్ మీద చూడటానికి ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అందుకే వీళ్ళిద్దరినీ కలిపి సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ, అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కావడం లేదు.
ఎన్టీయార్ – అల్లు అర్జున్
మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోలిద్దరిని కలుపుతూ ఒక భారీ యాక్షన్ సినిమా చేయగలిగితే, ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుంది. డ్యాన్స్ వేయడంలో ఇద్దరికీ సెపరేట్ స్టైల్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీయార్ – రామ్ చరణ్ ఎలాగైతే డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారో, వీళ్లిద్దరి మధ్య కూడా అలాంటి పోటీ పెడితే వీళ్ల డ్యాన్స్ కి ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఈ కాంబోలలో సినిమాలు పడితే ఆ మూవీస్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం పక్కా అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

