థియేటర్లలో మళ్ళీ మూడు క్లాస్ లు వస్తాయా? అంటే అవుననే వినిపిస్తోంది. గతంలో సినిమా థియేటర్లలో నేల, బెంచి, బాల్కనీ అంటూ మూడు క్లాస్ లు ఉండేవి. మల్టీప్లెక్స్ వచ్చాక ఆక్కడ సింగిల్ క్లాస్ కే పరిమితం అయ్యాయి. ఇక ఇటీవల సింగిల్ థియేటర్లలో సైతం రెండు క్లాస్ లకే పరిమితం చేస్తూ టిక్కెట్ రేట్లను పెంచి రూ.100, రూ.140 చేశారు. బి.సి సెంటర్లలో అయితే రూ.70, రూ.100 చేశారు. కానీ ఈ పెరిగిన రేట్లు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డాయా? అంటే శూన్యం అనే చెప్పాలి. పైగా రేటు ఎక్కువ కావడంతో సినిమాలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దానికి తోడు సినిమాలు విడుదలైన వారం, రెండు వారాల్లోనే ఓటీటీలో దర్శనం ఇస్తుంటే… పెద్ద హీరోల సినిమాలను సైతం థియేటర్లలో చూడటం తగ్గించేశారు.
గతంలో టాప్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే కనీసం ఓపెనింగ్స్ ఉండేవి. వారాంతం వరకూ వసూళ్ళకు ఎలాంటి ఢోకా లేకుండా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద హీరోల సినిమాలకు తొలి రోజు టిక్కెట్ రూ.200 నుంచి రూ.400 వరకూ వసూలు చేస్తుండటంతో అదే రేటుకు సంవత్సరం పాటు ఓటీటీలో సినిమాలు చూడవచ్చనే ఆలోచనలో పడిపోయారు ప్రేక్షకులు. దీంతో గతంలోలా థియేటర్ల వద్ద ప్రేక్షకజన సందోహం కానరావటం లేదు. గతంలో నేల, బెంచి టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ముందు అవి ఫాస్ట్ గా ఫుల్ అయ్యేవి. ఇప్పుడు రెండు క్లాస్ ల మధ్య వ్యత్యాసం తగ్గడంతో క్రింది క్లాస్ కి వెళ్ళే ఆడియన్స్ కొరవడిపోయారు. ఇటీవల విడుదలైన టాప్ హీరోల సినిమాలకు హౌస్ ఫుల్ బోర్డులు కానరాకపోవడానికి ఇదే కారణం. ఏ సెంటర్లలోనూ క్రింది క్లాస్ లు ఫుల్ కావడం లేదు. ఈ విషయమై అటు పంపిణీదారుల్లోనూ ప్రదర్శనదారుల్లోనూ మధనం మొదలైంది.
మళ్ళీ సింగిల్ థియేటర్లలో మూడు క్లాస్ ల సిస్టమ్ అమలు చేయాలనే ప్రతిపాదనలలో చర్చలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీదారులు సమావేశాలను నిర్వహిస్తూ ఎలా చేస్తే బాగుంటుంది? టికెట్ రేటు ఎంత పెడితే కనీసం రిలీజ్ రోజైనా హాల్స్ నిండుతాయనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. పంపిణీరంగంలో, నిర్మాణరంగంలో పేరున్న సంస్థకు చెందిన వ్యక్తితో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా నడిచాయట. మరి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా? కామన్ మేన్ కి మళ్ళీ అందుబాటులోకి టికెట్ రేట్లు దిగివస్తాయా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఎప్పుడు లభిస్తుందో చూద్దాం.