తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రసిద్ధ జపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన, రాబోయే వీడియో గేమ్ ‘డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్’ లో ,రాజమౌళి ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ చిన్న అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు.
అప్పటికే, 2022లో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం, జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 360° స్క్రీనింగ్‌ను కూడా ఆయన అక్కడ పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే ఈ టెక్నాలజీ రాజమౌళిని ఆకట్టుకుంది. ఇప్పటికే ‘డెత్ స్ట్రాండింగ్ 2’ ముందస్తు యాక్సెస్‌లో ఉన్న కొన్ని విడులలో, ‘ది అడ్వెంచరర్’ ‘అడ్వెంచరర్‌స్ సన్’ అనే పాత్రలు కనిపించాయి. వీటి ముఖచిత్రాలు, రూపురేఖలు రాజమౌళి కార్తికేయను పోలి ఉండటంతో గేమింగ్ కమ్యూనిటీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
గేమ్‌లో ప్రధాన పాత్రల్లో నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్, లియా సెడౌక్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ గేమ్ 2025 జూన్ 26న ప్లేస్టేషన్ 5 కి ప్రత్యేకంగా విడుదల కాబోతోంది. ఇది పూర్తిస్థాయి పాత్ర కాకపోయినా, ఒక వినోదాత్మక అతిథి పాత్ర. రాజమౌళి వంటి ఫిల్మ్ మేకర్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచేలా ఆయన ప్రాచుర్యాన్ని ఈ సంఘటన మరోసారి చాటుతోంది.