టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తనలోని గొప్ప మనసును చాటుకున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన విజయాన్ని అందించిన నిర్మాత అనిల్ సుంకరపై ప్రశంసలు కురిపించారు. ఒక నిర్మాతగా అనిల్ సుంకర తనకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, అందుకే ఆయనతో చేసే తన తదుపరి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోనని స్టేజ్ మీద ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
Also Read :Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్..
సినిమా సక్సెస్‌లో హీరో ఎంత కష్టపడతారో, నిర్మాత అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటారని శర్వానంద్ అభిప్రాయపడ్డారు. “విజయం విలువ నాకు బాగా తెలుసు, అందుకే నిర్మాతకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా హిట్టు వస్తే రెమ్యూనరేషన్ పెంచే హీరోలున్న ఈ రోజుల్లో, శర్వానంద్ ఇలా తన పారితోషికాన్ని వదులుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హీరో, నిర్మాత మధ్య ఇలాంటి మంచి అనుబంధం ఉంటే పరిశ్రమకు మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.