సమంత అక్కినేనికి నెటిజన్లు షాక్ ఇచ్చారు. నెట్టింట్లో ఇప్పుడు ‘షేమ్ ఆన్ యూ సమంత’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే… మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కాంట్రవర్సీకి తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. అయితే దర్శక నిర్మాతలు ఈ కాంట్రవర్సీపై స్పందిస్తూ ఈ సిరీస్ ఎవరి మనోభావాలనూ దెబ్బతీయదని, విడుదలయ్యాక ఈ వెబ్ సిరీస్ చూస్తేనే అది అర్థమవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ వివాదం సద్దుమణగలేదు. ఇప్పటికే జూన్ 4న విడుదల కానున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా #ShameonYouSamantha ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఇది చూసిన వారి మనస్సులో తమిళులు ఉగ్రవాదులనే భావన కలుగుతుందని తమిళ తంబీల వాదన. తమిళనాడు ప్రజలతో సహా ప్రభుత్వం కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ పై అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు రంగంలోకి దిగిన సమంత అభిమానులు ‘వి సపోర్ట్ సమంత’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ వెబ్ సిరీస్ ను తమిళనాడులో బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.