(జూన్ 25న మూడు పదుల ‘దీవానా’ ముచ్చట)
నేడు యావద్భారతదేశంలో ‘కింగ్ ఖాన్’గా జేజేలు అందుకుంటున్న షారుఖ్ ఖాన్ తొలిసారి బిగ్ స్క్రీన్ పై కనిపించిన చిత్రంగా ‘దీవానా’ నిలచింది. 1992 జూన్ 25న విడుదలైన ‘దీవానా’ చిత్రంతోనే షారుఖ్ ఖాన్ నటునిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘రొమాంటిక్ హీరో’గా జేజేలు అందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన చిత్రంగా నిలచిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’తో షారుఖ్ తారాపథంలోనూ అగ్రతారగా వెలుగులు విరజిమ్మాడు. ఒకప్పుడు వరుస విజయాలతో అభిమానులను అలరించిన షారుఖ్, ప్రస్తుతం పరాజయాల పలకరింపుతో సరైన కథతో జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.
రాబోయే మాధవన్ ‘రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్’లోనూ, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ ఛద్ధా’లోనూ, అమితాబ్-రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’లోనూ, సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’లో కూడా కేమియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు కింగ్ ఖాన్. షారుఖ్ హీరోగా రూపొందిన ‘పఠాన్’, ‘జవాన్’ మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీటితో పాటు రాజ్ కుమార్ హిరాణీ రూపొందించే ‘డంకీ’లోనూ షారుఖ్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలపైనే షారుఖ్ ఖాన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ నాటికీ షారుఖ్ ఖాన్ అనగానే ఆయన తొలి చిత్రం ‘దీవానా’ను గుర్తు చేసుకుంటారు కొందరు. అందులో షారుఖ్ ది పూర్తి స్థాయి పాత్రేమీ కాదు. రిషి కపూర్ మెయిన్ హీరో కాగా, ఆయన తరువాత షారుఖ్ ఖాన్ పాత్ర ప్రవేశిస్తుంది. అయినా జనాన్ని ఆకట్టుకోగలిగాడు ఖాన్. ‘దీవానా’ మూడు పదులు పూర్తి చేసుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ అభిమానులకు ఆనందం అంబరమంటక మానదు.
ఇంతకూ ‘దీవానా’ కథ ఏంటి? – రవి అనే కోటీశ్వరుడు కాజల్ అనే అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. రవి ఆస్తిని కాజేయాలని తలచే అతని పినతండ్రి ధీరేంద్ర, ఆయన కొడుకు నరేంద్ర రవిని అంతమొందించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో నరేంద్ర, రవి ఇద్దరూ చనిపోతారు. రవి తల్లి తన కోడలు కాజల్ ను తీసుకొని మరో నగరం చేరుతుంది. అక్కడ రమాకాంత్ అనే కోటీశ్వరుని కొడుకు రాజా జీవితాన్ని భలేగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ సారి కాజల్ ను రాజా చూడటం జరుగుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. అతనికి తన గతం గురించి చెబుతుంది కాజల్. దాంతో మరింతగా ఆమెను ప్రేమిస్తాడు రాజా. రమాకాంత్ కు ఈ విషయం తెలిసి, కొడుకును మందలిస్తాడు.
కానీ, రాజా తనకు కాజల్ కావాలని తపిస్తాడు. ఇంట్లోంచి బయటకు వచ్చి, తన మిత్రులతో కలసి ఓ గ్యారేజ్ తెరచి జీవితం సాగిస్తూ ఉంటాడు. అతని తపన చూసిన రవి తల్లి కూడా తన కోడలు కాజల్ కు ఎటూ తన కొడుకు లేడని, రాజాపై ప్రేమ చూపమని కోరుతుంది. రాజాపై కాజల్ ప్రేమ చూపిస్తుంది. వారు కొత్త జీవితం ఆరంభిస్తారు. అదే సమయంలో రాజా ఓ వ్యక్తిని కాపాడతాడు. అతను అందరూ చనిపోయాడనుకున్న కాజల్ మొదటి భర్త రవి. రాజా, అతడిని కాజల్ కు పరిచయం చేస్తాడు. ఆశ్చర్యపోతుంది కాజల్. ఇదే సమయంలో రవి బతికి ఉన్నాడని తెలుసుకున్న ధీరేంద్ర అతణ్ణి చంపాలని ప్రయత్నిస్తాడు. రాజా, కాజల్ ను ఎత్తుకు పోతాడు ధీరేంద్ర. వారిని రక్షించి, ధీరేంద్రను చంపుతూ తానూ అతనితో పాటే కన్నుమూస్తాడు రవి. అతని త్యాగాన్ని మననం చేసుకుంటారు రాజా, కాజల్. దాంతో కథ ముగుస్తుంది.
రవిగా రిషి కపూర్, కాజల్ గా దివ్యభారతి, రాజాగా షారుఖ్ ఖాన్, దీరేంద్రగా అమ్రిష్ పురి, నరేంద్రగా మోనిష్ బెహెల్ నటించిన ఈ చిత్రంలో దిలీప్ తాహిల్, సుష్మా సేథ్, దేవన్ వర్మ, ఆశా సచ్ దేవ్, అలోక్ నాథ్, బ్రహ్మచారి, అంకుశ్ మోహితే ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రాజ్ కన్వర్ దర్శకత్వం వహించగా, గుడ్డు ధనోవా, లలిత్ కపూర్, రాజూ కొఠారీ నిర్మించారు. ఈ సినిమాకు నదీమ్-శ్రవణ్ పాటలకు సంగీతం సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని సురీందర్ సోధి సమకూర్చారు. సమీర్ పాటలు పలికించారు. ఇందులోని “సోచోంగే తుమ్హే ప్యార్ కర్తే నహీ…”, “తేరీ ఉమ్మీద్ తేరే ఇంతెజార్…”, “ఐసీ దీవాన్గీ…”, “కోయి న కోయి చాహియే ప్యార్ కర్నేవాలే…”, “పాయలియా…”, “తేరే దర్ద్…” అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.
‘దీవానా’ చిత్రం షారుఖ్ ఖాన్ తో పాటు దర్శకుడు రాజ్ కన్వర్ కు కూడా తొలి చిత్రం. ఈ సినిమా 1992లో ‘బేటా’ తరువాత టాప్ గ్రాసర్ గా రెండో స్థానంలో నిలచింది. ‘దీవానా’ అనంతరం రాజ్ కన్వర్ “లాడ్లా, జాన్, జీత్, జుదాయి, ఇతిహాస్, దాగ్:ద ఫైర్, బాదల్, హర్ దిల్ జో ప్యార్ కరేగా” వంటి చిత్రాలను తెరకెక్కించి అలరించారు. ఈ సినిమాను చూస్తే పాత తరం ప్రేక్షకులకు హేమామాలిని, షమ్మీకపూర్, రాజేశ్ ఖన్నా నటించిన ‘అందాజ్’ (1971) గుర్తుకు రాకమానదు. అయితే ‘దీవానా’ గ్రాండ్ సక్సెస్ తరువాత ఈ తరహా ముక్కోణ ప్రేమకథా చిత్రాలకు దారి చూపిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఫ్రీమేక్ గా తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘ప్రేమాయణం’ అనే సినిమా రూపొందింది.