టాలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన సినిమాగా గుర్తింపు పొందింది ‘శివ’. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపింది. 1989లో విడుదలైన ఈ సినిమా, సాంకేతికంగా, కథా పద్ధతిలో, మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. యాక్షన్ చిత్రాలకే కాదు, కాలేజీ డ్రామాలకు కూడా రియలిస్టిక్ టచ్ ఇచ్చిన మొదటి తెలుగు సినిమా ఇది అని సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
Also Read : Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
ఇప్పుడు ఈ లెజెండరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 14న ‘శివ’ రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని గురించి తన భావాలను పంచుకున్నారు. “అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో నాకు తెలియదు. కానీ ‘శివ’ సినిమా చూశాక సినిమా అంటే ఏమిటో, దాన్ని ఎలా ఆలోచించాలో అర్థమైంది. ఆ సినిమా నా దృష్టి, నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది” అంటూ కమ్ముల పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ఆ సినిమాకు ఉన్న ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
రియలిస్టిక్ సినిమాలకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల దృష్టిలో ‘శివ’ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక పాఠశాల లాంటిదట. ఈ సినిమా ప్రభావం తన దర్శకత్వ శైలిలో కూడా కనిపిస్తుందని తెలిపారు. ‘శివ’ రీ-రిలీజ్ వార్తతో మరోసారి థియేటర్‌లో నాగార్జున మాస్ అటిట్యూడ్, వర్మ రియలిజం కలయికను పెద్ద తెరపై చూడబోతున్నాం అంటూ.. అభిమానులు, సినీ ప్రియులు ఉత్సాహంగా ఉన్నారు.