సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో అనేక రూమర్లు, పుకార్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బ్రతికే ఉన్న ఆయన గురించి అసత్య ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు స్పందించి “ధర్మేంద్రగారు ఆరోగ్యంగా ఉన్నారు, దయచేసి రూమర్లు ప్రచారం చేయొద్దు” అని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారు తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, డాక్టర్ల సూచనల మేరకు మందులు తీసుకుంటున్నారు. రూమర్లు మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు సన్నీ డియోల్ టీమ్ “దయచేసి ప్రైవసీని గౌరవించండి” అంటూ ప్రత్యేక నోటు కూడా విడుదల చేసింది. అయితే ధర్మేంద్రను ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లిన తొలి సెలబ్రిటీల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. తాజా కార్యక్రమంలో ఆయన ఈ విషయం గురించి భావోద్వేగంగా మాట్లాడారు.
ద-బంగ్ ది టూర్ రీలోడెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ మాట్లాడుతూ..“నేను ఇండస్ట్రీలోకి రాకముందే కొంతమంది స్టార్‌లు మా ఐకాన్‌లు. అందులో ధరమ్ జీ మాత్రం నాకు చాలా స్పెషల్. ఆయన నా తండ్రిలాంటి వ్యక్తి… అంతే. నేను ఆయనను అంతే ప్రేమతో చూస్తాను. ఆయన త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మనముందుకు వస్తారని ఆశిస్తున్నాం.” అని చెప్పారు. సల్మాన్ ఈ మాటలు చెప్పగానే అక్కడున్న అభిమానులు “ధరమ్ జీ లాంగ్ లివ్!” అంటూ నినాదాలు చేశారు. సల్మాన్ – ధర్మేంద్ర బంధం ఎంత ప్రత్యేకం? ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే ధర్మేంద్ర, సల్మాన్ మధ్య బంధం చాలా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడూ సల్మాన్‌ను ప్రేమగా ‘బేటా’ అని పిలుస్తూ, తన బయోపిక్ తీస్తే సల్మాన్‌నే నటించాలనుకుంటానని ధర్మేంద్ర అనేకసార్లు చెప్పిన విషయాలు ప్రత్యేకంగా గుర్తుండేలా ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం మరొకసారి స్పష్టంగా కనిపించింది.