రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ పూర్తయిన తర్వాత, రాజమౌళి మీద రాష్ట్రీయ వానర సేన ఒక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హనుమంతుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి తమ మనోభావాలు దెబ్బతీశాయని వారు పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ విషయం ఇంత చర్చ జరుగుతున్న సమయంలోనే, వారు మరో రెండు ఫిర్యాదులు చేయడానికి సిద్ధమైనట్లుగా వెల్లడించారు. అందులో ఒకటి, సినిమా ఈవెంట్లో మహేష్ బాబుని నంది మీద వచ్చినట్లుగా చూపించారు. నంది మీద కేవలం శివుడు మాత్రమే రావాలి. మహేష్ బాబు లాంటి హీరోని తీసుకురావడం ఏంటని రాష్ట్రీయ వానర సేన ప్రశ్నిస్తోంది.
అంతేకాక, బాహుబలి ఇటీవల రీ-రిలీజ్ చేసిన తర్వాత, బాహుబలి థియేటర్నల్ వార్ అనే ఒక కామిక్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నట్లు ఒక ట్రైలర్ ప్లే చేశారు. అందులో బాహుబలి రాక్షసుల పక్షాన నిలబడి ఇంద్రుడితో పోరాడుతున్నట్లుగా చూపించారు. “అసలు బాహుబలి లాంటి మానవుడు ఇంద్రుడితో పోరాడడం ఏంటి? అంటే దేవతలను కించపరుస్తున్నారా?” అంటూ వానర సేన ఫైర్ అవుతోంది. ఈ నేపధ్యంలో రాజమౌళి మీద మరో రెండు ఫిర్యాదులు నమోదు చేయనున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాజమౌళికి ఉన్న తలనొప్పులు కాస్త రెట్టింపు అయ్యాయని చెప్పక తప్పదు.