రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి శుక్రవారం నాడు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే, గురువారం రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు, శుక్రవారం నుంచి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారు. అయితే ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు, అంటే ఆదివారం వరకు మూడు రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 105, మల్టీప్లెక్స్‌లలో 132 రూపాయలు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు.
Also Read :The Raja Saab Part 2: రాజా సాబ్ 2కి టైటిల్ ఇదే!
అలాగే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో 62, మల్టీప్లెక్స్‌లో 89 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక టికెట్లు పెంచి అమ్మిన నేపథ్యంలో వచ్చే లాభంలో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.