నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, వీణా రావు హీరోయిన్‌గా, ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమం రేపు జరగబోతోంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
Read More: Preity Zinta: సురక్షితంగా ఇంటికి చేరుకున్నా.. అభిమానులకు క్షమాపణలు!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ కుమార్తెలు ముగ్గురూ ఈ సినిమా హీరో ఎన్టీఆర్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, పురందేశ్వరి, నారా భువనేశ్వరి ముగ్గురూ కలిసి ఈ కుర్రాడిని హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘న్యూ టాలెంట్ రైజ్ ఎన్టీఆర్’ అనే పేరుతో వైవీఎస్ చౌదరి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆయన భార్య గీతా ఎలమంచిలి నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. గీతా ఎన్నారై ఫ్రెండ్స్ ఫండ్ చేస్తున్న ఈ సినిమాతో కొత్త టాలెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు వైవీఎస్ చౌదరి సిద్ధమవుతున్నారు.