Alias Rukmini : అమ్మాయి పేరుతో నితిన్ ‘కోరికలే గుర్రాలైతే’ పుస్తకాలు! ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ అదిరిందిగా!

Alias Rukmini Trailer

Alias Rukmini Trailer

టాలీవుడ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రయోగాలు చేసే నేచురల్ స్టార్ నాని సమర్పణలో, హీరో నితిన్ ఓ క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న వినూత్న మూవీ ‘అలియాస్ రుక్మిణీ’. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీ కాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై, అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటేనే ఇదొక పక్కా వింటేజ్ వైబ్ ఉన్న క్రేజీ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామా అని అర్థమైపోతోంది. ఇందులో నితిన్ ‘కృష్ణ’ అనే ఫ్యామిలీ కోర్టు స్టెనో పాత్రలో కనిపించబోతున్నాడు. పైకి ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపించే ఈ కుర్రాడికి ఓ పెద్ద సీక్రెట్ ఉంటుంది! “కోరికలే గుర్రాలైతేనా.. ఛీ ఛీ ఇదేంటి, ఇవి చదువుతున్నాడా?” అని ఇంట్లో వాళ్లు షాక్ అవుతుంటే.. “చదవట్లేదు.. రాస్తున్నాడు!” అని వచ్చే ట్విస్ట్ కడుపుబ్బా నవ్విస్తోంది.

అంతేకాదు, కృష్ణ ఆ ‘అవేర్నెస్’ (రొమాంటిక్) పుస్తకాలను తన పేరుతో కాకుండా, ఓ అమ్మాయి పేరుతో రాస్తుంటాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అందుకే చివర్లో..  “ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? కృష్ణ అనా, లేకపోతే రుక్మిణీ అనా?” అని వచ్చే డైలాగ్ సినిమా టైటిల్‌కు సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. ట్రైలర్‌లో పెళ్లిచూపుల సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వరుసగా ముగ్గురు అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత, నాలుగో పెళ్లిచూపులకు వెళ్లిన కృష్ణ.. హీరోయిన్‌ను అడిగే ప్రశ్న ఆకట్టుకుంటోంది. “నీకిది ఎన్నో పెళ్లిచూపులు?” అని హీరో అడగగా, “నన్ను ఎంతమంది రిజెక్ట్ చేశారో తెలుసుకోవడానికా?” అని హీరోయిన్ అంటుంది. దానికి నితిన్..  “లేదు, నన్ను కలవడానికి మీరు ఎంతమందిని రిజెక్ట్ చేశారో తెలుసుకుందామని” అని చెప్పే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

మొదట్లో సరదాగా సాగిన ట్రైలర్, ఆ తర్వాత మెల్లగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ప్రేమ, ఎడబాటు, కృష్ణ మనసులోని సంఘర్షణను దర్శకుడు చాలా సహజంగా చూపించారు. ముఖ్యంగా చివర్లో నితిన్ ఎమోషనల్ అవుతూ.. “ఏడుస్తానయ్యా.. నా ఫీలింగ్ నా ఇష్టం.. నీకేం నొప్పి? ఏడుస్తా బరాబర్ ఏడుస్తా!” అని చెప్పే డైలాగ్ సినిమాలో బలమైన ఎమోషన్ ఉందని స్పష్టం చేస్తోంది. వెనక గోడలపై ‘వర్షం’, ‘వెంకీ’, ‘ఆంధ్రావాలా’, ‘పెదబాబు’ వంటి అప్పటి సినిమాల పోస్టర్లను చూస్తుంటే, ఈ కథ 2000వ దశకం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కళ్లద్దాలు, అమాయకమైన లుక్‌తో నితిన్ తన కెరీర్‌లోనే ఓ విభిన్నమైన పాత్రలో ఒదిగిపోయాడు. నాని సమర్పణ అంటేనే కంటెంట్ విషయంలో ప్రేక్షకులకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరి డిసెంబర్ 4న థియేటర్లలో ఈ ‘రుక్మిణీ’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి!