అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్టర్ జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలపబోతోంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఓటీటీపై దృష్టి పెడుతుండగా తాజాగా జేలో కూడా లిస్టులో చేరిపోయింది. ఆమె ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించనుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా పేరు ‘అట్లాస్’. బ్రాడ్ పేటన్ దర్శకుడు.
స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం లోపెజ్ చేయబోతోన్న ‘అట్లాస్’ మూవీలో టైటిల్ రోల్ ఆమెదే. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందిన ఒక సైనికుడు మానవజాతిని అంతం చేయటానికి పూనుకుంటాడు. చివరకు, ఆ డెడ్లీ మెషీన్ నుంచీ హ్యూమన్ రేస్ ని ‘అట్లాస్’ ఎలా కాపాడిందనేదే సినిమాలోని కథ.
జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ ‘మ్యారీ మీ’, యాక్షన్ కామెడీ ‘షాట్ గన్ వెడ్డింగ్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో వైపు, జేలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బెన్ అఫ్లెక్ తో మరోసారి ఎఫైర్ రాజేసింది. గతంలో కలసి తిరిగిన వారిద్దరూ వద్దనుకుని విడిపోయారు. కానీ, ప్రస్తుతం మళ్లీ దగ్గరయ్యారు. బెన్ ని లోపెజ్ పెళ్లాడే అవకాశాలున్నాయని హాలీవుడ్ మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది!