నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ మరో బ్రాండ్ కి ఇప్పుడు అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ని నియమించినట్టు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అచ్యుతరావు బొప్పన, ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు.
మాట తప్పను–మడమ తిప్పను అనే విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాలకృష్ణ వ్యక్తిత్వం, అన్విత గ్రూప్ మౌలిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని, అందుకే ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా కావాలని భావించడం, ఆయన ఒప్పుకోవటం సంస్థకు గర్వకారణమని తెలిపారు. ‘బిల్డ్ హ్యాపినెస్’ అనేదే అన్విత గ్రూప్ నినాదమని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారని అచ్యుతరావు బొప్పన పేర్కొన్నారు. సంతోషంతో నిండిన శాశ్వత వారసత్వాన్ని నిర్మించే ప్రయాణంలో ఆయన భాగస్వామ్యం సంస్థకు మరింత బలాన్నిస్తుందన్నారు.