మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తోంది. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. అయితే,
ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన ‘దళపతి’ చిత్రంలోని సాంగ్ బిట్‌ను వాడటంతో కాపీరైట్ ఇబ్బందులు వస్తాయేమోనని చర్చ మొదలైంది. సాధారణంగా సినిమాల్లో పాత పాటలను రీమిక్స్ చేయడం లేదా వాడటం సహజమే. కానీ సంగీత జ్ఞాని ఇళయరాజా తన పాటల విషయంలో కాపీరైట్ ఉల్లంఘనలను అస్సలు సహించడం లేదు. ఇటీవల అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తన అనుమతి లేకుండా పాటలు వాడినందుకు ఆయన కోర్టుకు వెళ్లగా, తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో థ్యాంక్యూ మీట్ లో ‘దళపతి’ సాంగ్ బిట్ వాడటంపై విలేకరులు అనిల్ రావిపూడిని ప్రశ్నించారు.
ఈ విషయం పై దర్శకుడు అనిల్ రావిపూడి చాలా స్పష్టంగా స్పందించారు..‘మేము ఏది ఇష్టారాజ్యంగా చేయలేదు, ప్రతిదీ పద్ధతి ప్రకారం జరిగింది. సినిమా నిర్మాతలు స్వయంగా ఇళయరాజా గారిని కలిసి, చిరంజీవి గారి సినిమాలో ఆయన పాటను వాడుకుంటామని అనుమతి కోరారు. దానికి రాజాగారు ఎంతో సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ఎలాంటి చిక్కులు లేకుండా, ఆయన అనుమతితోనే ఆ సాంగ్ బిట్‌ను వాడుకున్నాము’ అని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి తెరపడింది.