తెలుగు సాహితీ క్షేత్రాన్ని తన రచనలతో సుసంపన్నం చేశారు కవిస్రమాట్ విశ్వనాథ సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరిస్తే, సాహితీ రంగం ఆయనను జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. 1895లో జన్మించి, 1976లో కన్నుమూసిన విశ్వనాథ సత్యనారాయణను ఈ తరం సాహితీ కారులూ నిత్య స్మరిస్తుంటారంటే ఆయన రచనల ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. తెలుగు సాహితీ రంగంలో విశ్వనాధ స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కవిసమ్రాట్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరాం. ‘కవి సమ్రాట్’ పేరుతో గంట నిడివి గల సినిమాను ఆయన నిర్మించారు. అందులో విశ్వనాథ పాత్రను ఎల్.బి. శ్రీరామే పోషించారు. ఈ చిత్రానికి సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించగా, జోశ్యభట్ల సంగీతాన్ని సమకూర్చారు. అతి త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రజల ముందుకు రానుంది.