కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘కాంతార’ సినిమా, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 చుట్టూ ప్రస్తుతం రహస్యాలు, అపోహలు, గాసిప్స్ తిరుగుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, నిర్మాణ దశలోనే చాలా సమస్యలు ఎదురుకుంది. చిత్రబృందంలోని నలుగురు సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదాలు, ఇంకా సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి.. ఈ సంఘటనలతో కాంతార టీమ్‌ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అన్న సందేహాలను రేకెత్తించాయి. మీడియా కూడా ఈ అంశాలను హైలైట్ చేయడంతో, ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఎట్టకేలకి, చిత్ర నిర్మాత చలువే గౌడ ఈ విషయంపై స్పందించారు.
Also Read : Coolie : ఏంటి.. కూలీ సినిమాకి నాగార్జున మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా?
‘మా సినిమాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కొన్ని కథనాలు పూర్తిగా తప్పు. అవును, కొన్ని ప్రమాదాలు జరిగినా, ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. 2025లో ఒకసారి సెట్లో అగ్నిప్రమాదం జరిగింది, కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే, ఒకసారి నదిలో పడవ మునిగింది అప్పుడు కెమెరాలు, పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయి” అని వివరించారు. అలాగే, సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె దివ్యదర్శనంలో కొంత అడ్డంకులు వచ్చినా, చివరికి చిత్రీకరణ విజయవంతంగా పూర్తవుతుందని చెప్పారు. ‘ప్రతిరోజూ తెల్లవారుఝామున 4 గంటలకు లేచి, 6 గంటలకు షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. మధ్యలో ఎన్నో విమర్శలు ఎదురైనా, ఇప్పుడు ఫుటేజ్ చూసి చాలా సంతృప్తిగా ఉంది’ అని చలువే గౌడ తెలిపారు. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీని 2025 అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతోంది.