టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే ఊహించని సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్ మాయమైన వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించబడింది. అయితే, ఆ తర్వాత చరిత కనిపించకుండా పోయింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు, చరితలు సినిమాకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:RCB: ఆర్సీబీ టైటిల్ గెలిస్తే.. జూన్ 4న పబ్లిక్ హాలిడే ?
తాజాగా చెన్నైలో జరిగిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో కూడా విష్ణు ఈ ఘటనను ప్రస్తావించారు. “మా టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమాను ఒక ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దింది. ఇలాంటి కుట్రలు మమ్మల్ని ఆపలేవు. ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్‌ను వినోదం కోసం ప్రసారం చేయవద్దని కోరుతున్నాను” అని విజ్ఞప్తి చేశారు. ఈ హార్డ్ డ్రైవ్ మాయం వెనుక మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపిస్తున్నారు. రఘు, మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని చెన్నైలో పేర్కొన్నారు. 45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని, ఈ ఘటన వెనుక మనోజ్ కుటుంబం నుంచి కావాలనే కుట్ర జరిగిందని విష్ణు టీమ్ ఆరోపణలు చేస్తోంది. విష్ణు-మనోజ్ మధ్య చాలా కాలంగా కుటుంబ వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఆ వివాదాలు మరింత ముదిరాయని అనిపిస్తోంది. అయితే, మనోజ్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “మనోజ్ ‘భైరవం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి కుట్రలకు సమయం ఎక్కడిది?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Police Complaint : ‘పోలీస్ కంప్లెయింట్’ ఇస్తానంటున్న వరలక్ష్మి శరత్ కుమార్
ఎవరి ప్రోత్సాహంతో?
రఘు, చరితలు సొంతంగా ఈ చర్యకు పాల్పడ్డారా లేక ఎవరి ప్రోత్సాహంతోనైనా ఈ పని చేశారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. విష్ణు వర్గం ఈ ఘటనను “సినిమా విడుదలను అడ్డుకోవడానికి, కంటెంట్ లీక్ చేయడానికి చేసిన కుట్ర”గా చెబుతుండగా మనోజ్ నుంచి ఇంతవరకు స్పందన రాకపోవడం సందేహాలను మరింత రేకెత్తిస్తోంది.