ఐపీఎల్ టైటిల్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఈ సారి ఆర్‌సీబీకి సువర్ణావకాశం లభించింది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను ఓడించడం ద్వారా RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది.పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ రేసులో మిగతా జట్లు ఉన్నా.. అందరి చూపు ఆర్సీబీ మీదే ఉంది. టైటిల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఎంతగా ఎదురుచూస్తుందో.. ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువే ఆరాటపడుతున్నారు. కోహ్లీ కోసమే కోట్లాదిమంది అభిమానులు ఆర్సీబీ ఆడే మ్యాచ్ లను చూస్తున్నారు. ప్రతిసారి ఈ సాల కప్ నందే స్లోగన్ వినివిని విసిగిపోయారు. కానీ ఈ సారి మాత్రం కప్ ఆర్సీబీనే వరించేలా కనిపిస్తుంది. జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.
బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఏవిధంగా చూసినా ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. జూన్ 4న దేశవ్యాప్తంగా సెలెబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ఆర్సీబీ ఫ్యాన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశాడు. జూన్3న ఆర్సీబీ కప్ కొడుతోంది, జూన్4న ప్రశాంతంగా సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించాలని లేఖలో కోరాడు. బెళగావి జిల్లాకు చెందిన శివానంద్ మల్లన్న అనే అభిమాని ఆర్‌సిబి ఐపిఎల్ గెలిచిన రోజును కర్ణాటక రాజ్యోత్సవం మాదిరిగానే ఆర్‌సిబి అభిమానుల పండుగగా అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరాడు. ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.