పల్నాడు జిల్లా, నర్సరావుపేటలో సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ S/O వైజయంతి తొలి పాట విడుదల కార్యక్రమం సోమవారం (మార్చి 31, 2025) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఉత్సాహంగా పాల్గొని, వాతావరణాన్ని సందడి మయం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన కళ్యాణ్ రామ్, అభిమానులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. “పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పటాస్ సినిమా తర్వాత మొదటిసారి బయటికి వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే ఇది సినిమా సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది,” అని ఆయన అన్నారు.
Kalyanram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
ఈ సందర్భంగా అర్జున్ S/O వైజయంతి చిత్రం గురించి మాట్లాడుతూ, “నా సినిమా అతనొక్కడే ఎలా అయితే పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా కూడా ఇరవై సంవత్సరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఈ చిత్రంలో విజయశాంతి గారు నాకు తల్లి పాత్ర పోషిస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,” అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. అర్జున్ S/O వైజయంతి సినిమా తల్లులకు అంకితమని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ చిత్రంలో తల్లి-కొడుకు మధ్య అనుబంధం, భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన వెల్లడించారు. “మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మానాన్నల పుట్టిన రోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా తల్లుల గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం,” అని ఆయన ఉద్ఘాటించారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. విజయశాంతి ఈ సినిమాలో పవర్‌ఫుల్ తల్లి పాత్రలో కనిపించనుండగా, సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు విడుదలైన తొలి పాట “నాయల్ది” ఒక మాస్ డ్యాన్స్ నంబర్‌గా రూపొందింది. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ లుక్‌లో ఉర్రూతలూగించే నృత్యాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ పాట కార్ని. వాల్ వాతావరణంలో చిత్రీకరించబడింది, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది.