Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర కూడా అత్యంత కీలకమైనదిగా తెలుస్తోంది. ఈ పాత్రను ఓ స్టార్ హీరోతో చేయిస్తే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోల పేర్లను ఆయన ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందని టాక్ నడుస్తోంది. ‘జై హనుమాన్’ ప్రధానంగా రిషబ్ శెట్టి సినిమాగానే గుర్తింపు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అందులో గెస్ట్ రోల్ తరహాలో శ్రీరాముడి పాత్ర చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ముందుకొస్తారా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో జరుగుతోంది. ముఖ్యంగా హనుమంతుడి పాత్రకు భారీ ప్రాధాన్యత ఉండటంతో ఈ విషయంలో హీరోలు ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ ముందు రెండు మార్గాలు ఉన్నట్లు సమాచారం. శ్రీరాముడి పాత్ర కోసం కన్నడ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను ఒప్పించడం ఒక ఆప్షన్‌గా కనిపిస్తోంది. లేదంటే టెక్నాలజీ సాయంతో పూర్తిగా ఏఐ ఆధారితంగా శ్రీరాముడి పాత్రను రూపొందించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా భారీ మేకోవర్‌తో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అలాగే తేజ సజ్జ, రానా దగ్గుబాటి వంటి నటులు కూడా ఈ యూనివర్స్‌లో కీలకంగా కనిపించనున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు వామిఖ గబ్బి కూడా సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. దీంతో ప్రశాంత్ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

