‘స్కామ్ 1992’తో సంచలనం సృష్టించిన హన్సల్ మెహతా ‘ఫరాజ్’ మోషన్ పోస్టర్ తో జనం ముందుకొచ్చాడు. ఆయన నెక్ట్స్ బిగ్ స్క్రీన్ రిలీజ్ ‘ఫరాజ్’ మూవీనే. కొత్త నటీనటులతో నిర్మాతలు అనుభవ్ సిన్హా,, భూషణ్ కుమార్ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ హన్సల్ మెహతా ‘బంగ్లాదేశ్ కేఫ్ అటాక్’ చుట్టూ తన కథ రాసుకున్నాడు. 2016 జూలై 1న ఢాకా నగరంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. అయిదుగురు టెర్రరిస్టులు భయంకరమైన హింసకు పాల్పడటమే కాక 50 మందిని బందీలుగా పట్టుకున్నారు.
Read Also : గోపీచంద్ 30వ చిత్రంలో డా. రాజశేఖర్!
12 గంటల పాటూ సాగే హోస్టేజ్ స్టోరీగా ‘ఫరాజ్’ మూవీ రానుంది. అయితే, ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదంటున్నాడు డైరెక్టర్. దారుణమైన హింస ఎదురైనప్పుడు దానిపై విజయం సాధించిన మానవత్వం కథ అంటూ తన సినిమా గురించి వివరణ ఇచ్చాడు హన్సల్ మెహతా. తమ సినిమాలో ఉగ్రవాదం, హింస మాత్రమే కాదనీ… ఆశ, నమ్మకం కూడా అంతర్లీనంగా ప్రవహిస్తుంటాయనీ… నిర్మాత అనుభవ్ సిన్హా చెప్పాడు. ఇక మరో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ “2016 బంగ్లాదేశ్ కేఫ్ అటాక్ పై వస్తోన్న తొలి చిత్రం ‘ఫరాజే’. అందుకే, మేం సాధ్యమైనంత వరకూ యదార్థంగా ఏం జరిగిందో చూపించే ప్రయత్నం చేశాం” అన్నాడు.
‘ఫరాజ్’ సినిమాతో జహాన్ కపూర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అతడితో పాటూ యువ నటుడు ఆదిత్య రావల్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించాడు. చూడాలి మరి, ‘స్కామ్ 1992’ బిగ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న హన్సల్ ‘ఫరాజ్’తో ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ స్వంతం చేసుకుంటాడో…