అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యన ఒక ఆసక్తికరమైన వీడియోతో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించే సినిమాకి సంబంధించి అనేక వార్తలు తెరమీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించే అవకాశం ఉందని ఒక ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు హీరోయిన్ల గురించి కూడా ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట. అందులో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా, ఇద్దరు హీరోయిన్లకు మాత్రం మైనర్ రోల్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక ముగ్గురు కీలకమైన హీరోయిన్ల పాత్రల కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలిస్తున్నారని, అందులో ఒక పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారని అంటున్నారు.
Hit 3 : ఏపీలో టికెట్ రేట్ హైక్ !
ఇప్పటికే అట్లీ టీం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించిందని, ఆమె కథ విని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమెకు కథ నచ్చింది కానీ డేట్స్ కుదురుతాయో లేదో చెక్ చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కావాల్సి రావడంతో మిగతా పాత్రల కోసం ఎవరిని తీసుకోబోతున్నారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. పోటపోటీగా హీరోయిన్లను దింపితే వారికి కూడా దండిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం ఎవరు బరిలోకి దిగబోతున్నారో చూడాల్సి ఉంది.