సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా ఏఆర్రెహమాన్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఆయన సతీమణి సైరా భాను తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
అయితే ఏఆర్ రెహమాన్ ఆయన సతీమణి సైరా భాను 29 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి ఇద్దరు పరస్పర అంగీకారంతో ముగింపు పలికినట్లు కొంత కాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాక కూడా వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ముచ్చటించుకున్నారు. కానీ తాజాగా రెహమాన్ ఆరోగ్య పరిస్థితిని తెలిశాక సైరా భాను మాట్లాడుతూ.. ‘రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అల్లా దయతో ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ నా గురించి ప్రస్తావించేటప్పుడు దయచేసి రెహమాన్ మాజీ భార్య అనకండి. ఇంకా మేము అధికారికంగా విడాకులు తీసుకోలేదు. గత కొంతకాలంగా నేను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను, అందుకే దూరంగా ఉంటున్నాం. అంతేకానీ ఇంకా విడాకులు తీసుకోలేదు’ అని స్పష్టం చేసింది. ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.