విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో శ్రీవిష్ణు సిద్ధహస్తుడు. అతని తాజా చిత్రం రాజ రాజ చోర
సైతం అదే జాబితాలో చేరుతుందని దాని పోస్టర్ డిజైన్స్ ను, పబ్లిసిటీ తీరును గమనిస్తే అర్థమౌతుంది. చోర గాథను త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తామని మొన్న శ్రీవిష్ణు, గంగవ్వతో చెప్పించిన చిత్ర బృందం అనుకున్నట్టుగానే శుక్రవారం ఈ మూవీ కంటెంట్ ఏమిటో చెప్పకనే చెప్పింది. రాజు కిరీటాన్ని దొంగలించిన దొంగ, కొంత కాలం రాజసింహాసంపై కూర్చుని, ఆ తర్వాత అసలు రాజు రావడంతో పలాయనం చిత్తగిస్తాడు. తనను మోసం చేసిన ఆ దొంగను పట్టుకోవడానికి రాజు ఏం చేశాడు? చివరకు ఆ దొంగ దొరికాడా, లేదా? అనేదే ఈ చిత్ర కథ అట. గంగవ్వ ఓ పిల్లాడికి చెప్పే ఈ కథ ముగింపు ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పుడు కథలు వింటూ ఊ కొట్టడం, ఊహూ అనడాన్ని సైతం కొందరు పెద్దలు ఆటపట్టించే వారు. ఆ ముచ్చట్లను ఈ చోరగాథతో గంగవ్వ గుర్తు చేసింది. ఇంతకూ గంగవ్వ చెప్పిన కథే సినిమా కథ అవునో కాదో తెలియాలంటే ఈ నెల 18న విడుదలయ్యే టీజర్ ను చూడాలి. అప్పుడు కథ గురించి కొంత తెలిసే ఆస్కారం ఉంది. అప్పటి వరకూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకోవాల్సింది.
శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హసిత్ గోలి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.