Chinmayi Sripada Gives Clarity On Differences With Samantha: సమంత, చిన్మయి శ్రీపాద ఎంత మంచి స్నేహితులతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమా ద్వారా కలిసిన వీరి మధ్య అప్పట్నుంచే మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సమంత నటనకు చిన్మయి గాత్రం సరిగ్గా సరిపోవడంతో.. ప్రతీ సినిమాకు వీళ్లు కలిసి పని చేశారు. వివాదాల విషయంలోనూ కలిసే గళం విప్పేవారంటే, వీళ్లు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది అర్థం చేసుకోవచ్చు. అలాంటి వీరి స్నేహం ఇప్పుడు విచ్ఛిన్నమైందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. కారణాలైతే తెలీదు కానీ, వీరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారాలైతే జోరుగా జరిగాయి. సోషల్ మీడియాలోనూ కలిసి ఫోటోలు పెట్టక చాలాకాలమే అవుతోంది కాబట్టి.. ఈ విభేదాల వార్తలు మరింత ఎక్కువగా చక్కర్లు కొట్టాయి.
అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చిన్మయి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తామిద్దరం కలిసినప్పుడల్లా ఫోటోలు పెట్టనంత మాత్రాన తాము విడిపోయినట్లు కాదని తెలిపింది. తాము తరచూ కలుస్తూనే ఉంటామని.. కలిసి పార్టీలకు, డిన్నర్లకు వెళ్తుంటామని క్లారిటీ ఇచ్చింది. తాము కలిసే విషయం అందరికీ చెప్పడం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేదని, అందుకే తాము కలిసే విషయాలను ఎవరితో పంచుకోమని చెప్పింది. తాము కలవాలనుకుంటే, ఇంట్లోనే కలుసుకుంటామని వెల్లడిచింది. సమంత చాలా మంచి వ్యక్తి అని, ఆమె వల్లే తెలుగులో తనకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి కెరీర్ వచ్చిందని పేర్కొంది. కాకపోతే.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో సమంతతో తన ప్రయాణం దాదాపు ముగిసిందని తాను అనుకుంటున్నానని, ఎందుకంటే ఇప్పుడు సమంతే తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోందని, ఇప్పుడు ఆమెకు తన గాత్రం అవసరం లేదని చెప్పుకొచ్చింది.