తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు హాజరయ్యారు.
Also Read:Ashwin Retirement: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!
శరత్ కుమార్ తన ఫిర్యాదులో, విజయ్ నడుస్తున్న ర్యాంప్‌పై ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఆయన బౌన్సర్లు, భద్రతా సిబ్బంది తనను దారుణంగా కిందకు నెట్టివేశారని, దీంతో తీవ్రమైన గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. ఈ ఘటనలో తన ఛాతీకి గాయాలు కావడంతో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరంబలూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా, కున్నం పోలీసులు విజయ్ సహా భద్రతా సిబ్బందిపై భారతీయ న్యాయ సంహిత (BNSS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, శరత్ కుమార్‌ను బౌన్సర్లు ర్యాంప్‌పై నుండి నెట్టివేయడం, ఆయన రైలింగ్‌ను పట్టుకొని కొద్దిసేపు వేలాడిన తర్వాత కింద పడిపోవడం కనిపిస్తుంది. ఇక విజయ్ అభిమానులు ఈ ఫిర్యాదును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. మదురైలో జరిగిన ఈ బహిరంగ సభకు లక్షలాది మంది హాజరైన తీరును అధికార పార్టీ (డీఎంకే) జీర్ణించుకోలేకపోతుందని, అందుకే విజయ్ పార్టీకి అడ్డంకులు సృష్టించేందుకు ఇలాంటి ఫిర్యాదులను ప్రోత్సహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.