రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరిస్ కు దేశమంతా చక్కని స్పందన లభిస్తోంది. దైవానుగ్రహంతోనే ఇది సాధ్యమైందని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ చెబుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ఈ సీరిస్ కు వస్తున్నరెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఈ వెబ్ సీరిస్ పై కొందరు గుర్రుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం బోయ్ కాట్ అమెజాన్, బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 2 అగైనెస్ట్ తమిళ్స్ అంటూ కొందరు హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో హంగామా చేశారు. మద్యపానాన్ని, కులతత్వ్తాన్ని దూరంగా ఉంచిన ఏకైక ఆర్మీ ఎల్.టి.టి.ఈ నే అని, కానీ ఈ వెబ్ సీరిస్ లో అందుకు విరుద్ధంగా చూపించారని కొందరు విమర్శించగా, ఎల్.టి.టి.ఈ…. ఐఎస్ఐతో చేతులు కలిపి భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించిందని చూపడం దారుణమంటూ కొందరు విరుచుకుపడ్డారు. తమిళులను భారత వ్యతిరేకులుగా ఇందులో చూపించారని మరి కొందరు వాపోయారు.
ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న చేరన్ అయితే… తాను ఫ్యామిలీ మ్యాన్ -2ను బోయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వెబ్ సీరిస్ లో అసభ్యకరమైన సన్నివేశాలు, అసత్యాలు ఉన్నాయని, తమిళుల స్వాతంత్రం కోసం పోరాడిన ఓ సంస్థను దెబ్బతీసే విధంగా దీనిని తీశారని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. తాను అమెజాన్ ప్రైమ్ ను అన్ సబ్ స్క్రైబ్ చేశానని, ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరిస్ ప్రసారాలను ఆపేంత వరకూ దానిని తిరిగి సబ్ స్క్రైబ్ చేయనని అన్నాడు. మరి తమిళుల కోపాన్ని చల్లార్చేందుకు రాజ్ అండ్ డీకే ఏంచేస్తారో చూడాలి.